తెలంగాణ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల అక్రమ అరెస్టు, గృహ నిర్బంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం చర్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ లీడర్ హరీశ్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించేందుకు ట్యాంక్ బండ్ వెళ్లకుండా ఈ నిర్బంధాలు ఎందుకు అని రేవంత్ సర్కారును ప్రశ్నించారు.
ఇది నీ నిరంకుశ, నియంతృత్వ పాలనకు నిలువుటద్దమని విమర్శించారు.మీ అప్రజాస్వామిక విధానాలు, రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వైఖరిని చూసి హైదరాబాద్ నడిగడ్డపై ఉన్న అంబేద్కర్ సైతం నివ్వెరపోతున్నాడని మండిపడ్డారు.ఒకవైపు ప్రజాపాలన పేరిట విజయోత్సవాలు అని ప్రచారం చేస్తూ మరోవైపు రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని ప్రకటించారని సీఎం రేవంత్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. వెంటనే బేషరతుగా అక్రమంగా అదుపులోకి తీసుకున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.