రాష్ట్ర వ్యాప్తంగా వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రాత్రిపగలు తేడా లేకుండా రహదారి వెంట వెళ్లేవారిపైకి ఎగబడుతున్నాయి. ఇక చిన్నారులను వెంటపడి మరీ కరుస్తున్నాయి. ఈ మధ్యకాలంలో వీధి కుక్కల దాడులకు సంబంధించిన ఘటనలు పెరిగిపోయాయి. ఇక హైదరాబాద్ నగరంలో ఈ సంఖ్య మరీ అధికంగా ఉంది.
ఈ క్రమంలోనే తాజాగా వీధి కుక్కల దాడిలో 25 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని 25వ వార్డులో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 25 మంది చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేశాయి.కుటుంబీకులు చిన్నారులను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. మున్సిపల్ అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని కాలనీ వాసులు మండిపడ్డారు.