తెలంగాణ ప్రభుత్వం కేవలం బడా కాంట్రాక్టర్లకే బిల్లులు చెల్లిస్తోందని, మరి సర్పంచుల సంగతేంటని మాజీ మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భార్య మెడలోని పుస్తెను అమ్మి గ్రామాల్లో సర్పంచులు అభివృద్ధి పనులు చేశారని వారికి ఎందుకు బిల్లులు చెల్లించడం లేదని ఫైర్ అయ్యారు. సోమవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ..గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు.
జీపీ జనరల్ ఫండ్స్‌కు సంబంధించి ఫైనాన్స్ శాఖ నుంచి క్లియరెన్స్ ఇవ్వక పోవడం వల్లే పంచాయతీల్లో చెక్కులు పాస్ అవ్వక సర్పంచ్‌లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని గుర్తుచేశారు. ఒక్క నవంబర్ నెలలోనే బడా కాంట్రాక్టర్లకు ప్రభుత్వం రూ.1,200 కోట్ల బిల్లులు చెల్లిచిందని.. చిన్న కాంట్రాక్టర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు మాత్రం నయా పైసా చెల్లించపోవడం దారుణమని రేవంత్ సర్కారును అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించారు.