ఏపీలోని తిరుపతి జిల్లాలోని వరదయ్యపాళెంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి ఓ భారీ కంటైనర్ దూసుకొచ్చింది.రాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. తడ వైపు నుంచి శ్రీకాకుళం వెళుతున్న కంటైనర్ అదుపుతప్పి ఆలయంలోకి దూసుకెళ్లడంతో ముందున్న ఇనుప గేట్లతో సహా గరుత్మంతుడి విగ్రహం ధ్వంసమైంది.
ఈ ప్రమాదంలో ఒక మహిళకు గాయాలు కూడా అయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. అయితే, మద్యం మత్తులోనే డ్రైవర్ వాహనాన్ని నడిపినట్లు పోలీసుల విచారణలో తేలింది. వెంటనే డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కంటైనర్ను అక్కడి నుంచి తొలగించారు.