తెలంగాణ ప్రజలకు అలర్ట్.. భూమి లేని కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంతో ప్రభుత్వం భరోసా కల్పించనుంది. ఈ స్కీమ్‌ను జనవరి 26 నుంచి ప్రారంభించనుండగా.. ఏడాదికి రెండు విడతల్లో రూ. 12వేలు జమ చేయనుంది. ఈ స్కీమ్‌కు సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా.. లబ్ధిదారుల ఎంపిక కొలిక్కి వచ్చినట్లు తెలిసింది.
సుమారు 10 లక్షల కుటుంబాలను ప్రభుత్వం అర్హులుగా గుర్తించినట్లు సమాచారం. కాగా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఏడాదికి ఒకసారి మహిళల ఖాతాల్లోకి రూ.12వేలు వేస్తామని తెలంగాణ మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. కూలీల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ చేస్తున్నామని… కుటుంబంలో ఉండే ఉపాధి హామీ మహిళా కూలీ బ్యాంకు ఖాతాల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మొత్తాన్ని జమ చేస్తామని ప్రకటించారు. మహిళా పక్షపాతి ప్రభుత్వం.. అందుకే మహిళల ఖాతాల్లోకి నగదు బదిలీ చేస్తున్నామని తెలిపారు. ఇలాంటి పథకాన్ని తీసుకురావడం పేద కుటుంబం నుంచి వచ్చిన నాకు ఎంతో సంతోషం కలిగించిందన్నారు.