ప్రయాగ్ రాజ్ లో “మహాకుంభ” విజయవంతంగా ముగియడం సమష్టి కృషి కి నిదర్శనం అని పీఎం మోడీ అన్నారు. అభివృద్ధి చెందుతున్న భారత్ స్పూర్తి ని “మహకుంభ” ప్రతిబింబించింది. భారత్ సామర్థ్యాన్ని శంకించిన వారికి “మహాకుంభ” విజయం చెంపపెట్టు లాంటిది. 45 రోజుల పాటు సాగిన “మహకుంభ” 144 ఏళ్ళ తర్వాత, ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో గుమికూడిన మతపరమైన ప్రజా సమూహిక కార్యక్రమం. సుమారు 66 కోట్ల మంది మూడు నదులు —గంగా, యమున, సరస్వతి— కలిసిన “త్రివేణి సంగమం” లో స్నానం చేశారు.
భారత్ గొప్పదనాన్ని ప్రపంచం మొత్తం వీక్షించింది. “మహాకుంభ” విజయానికి సమాజపరంగా, ప్రభుత్వపరంగా కృషి చేసిన “కర్మ యోగులు” అందరికీ కృతజ్ఞతలు. మధ్య ప్రాచ్యం, యూరోప్ లో జరుగుతున్న యుద్ధాలతో వివిధ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ సవాళ్ళ నేపథ్యంలో, “భిన్నత్వంలో ఏకత్వం” ప్రదర్శించడమే మన శక్తి. సగర్వంగా ప్రాచీన సంప్రదాయాలను, విశ్వాసాన్ని మహాకుంభ ద్వారా నవతరం ఆకళింపు చేసుకుని, అనుసంధానం కావడం ఎంతో ఆనందదాయకం అని మోడీ పేర్కొన్నారు.