యాసంగి పంటను రైస్ మిల్లర్లు తరుగు పేరిట దోపిడీ చేస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తూకంలో తరుగు పేరిట తక్కువ జోకుతున్నారని.. ఈ క్రమంలోనే రైస్ మిల్లర్ల దోపిడీని నిరసిస్తూ కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని చీనూర్ గ్రామ రైతులు గురువారం రాంప్రతాప్ థియేటర్ సమీపంలో బోధన్ -హైదరాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.
ప్రస్తుతం రబీ సీజన్లో పండించిన ధాన్యం దిగుబడి రాక రైతులు తీవ్రంగా నష్టపోతుంటే..మరోవైపు రైస్ మిల్లర్లు కుమ్మక్కై వరి ధాన్యం తూకంలో అధిక తరుగును తీస్తూ, ఒక్కో లారీ లోడ్‌లో 8 నుంచి 11 క్వింటాళ్ల వరకు ధాన్యం తరుగు కింద తీస్తున్నారని రైతులు ఆరోపించారు. చీనూరు గ్రామంలోనే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలకవర్గం, అధికారులు, రైస్ మిల్లర్లు కుమ్మక్కై వరి ధాన్యం తూకంలో మోసాలకు పాల్పడుతున్నారని రాస్తారోకో చేపట్టారు. ఘటన స్థలికి ఎల్లారెడ్డి సీఐ సతీష్ కుమార్, నాగిరెడ్డిపేట ఎస్సై మల్లారెడ్డిలు చేరుకొని రైతులను సముదాయించి రాస్తారోకోను విరమింపజేసే ప్రయత్నం చేశారు.