గెస్టు ఫ్యాకల్టీకి ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. గత కొంతకాలంగా తమ వేతనాలు పెంచాలని గెస్టు లెక్చరర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుండగా.. తాజాగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ దీనిపై స్పందించారు.ఈ క్రమంలోనే ఇంటర్మీడియట్‌కు బోధిస్తున్న 3,572 మంది ఒప్పంద లెక్చరర్ల సర్వీసును.. వచ్చే విద్యా సంవత్సరం జూన్ 1 నుంచి 2026 ఏప్రిల్ 30 వరకు పునరుద్ధరించారు.ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి తోడు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీ వేతనాలను పెంచారు. ప్రస్తుతం గంటకు రూ.150 చొప్పున నెలకు గరిష్ఠంగా రూ.10,000 ఇవ్వాలనే నిబంధన ఉంది.
ఈ క్రమంలో గంటకు రూ.375 చొప్పున గరిష్ఠంగా నెలకు రూ.27వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదించింది.కాగా, కొన్నేళ్లుగా వేతనం పెంచాలని గెస్ట్ ఫ్యాకల్టీ కోరుతున్నా.. గత జగన్ సర్కారు పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి.తాజాగా కూటమి ప్రభుత్వం వేతనాలు పెంచడంతో గెస్టు లెక్చరర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.