దేశ భద్రత, సురక్షిత ప్రాధాన్యతలకు అనుగుణంగా పది కీలక ఉపగ్రహాలు 24 గంటలూ నిఘా కంట్లుగా పనిచేస్తున్నాయని ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ వెల్లడించారు. త్రిపుర రాష్ట్రంలోని అగర్తలలో జరిగిన సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (CAU) ఐదవ స్నాతకోత్సవంలో ఆదివారం ఆయన మాట్లాడారు. ఈ ఉపగ్రహాలు దేశ భద్రతకు బలమైన గోడలుగా నిలుస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. “భారతదేశానికి ఉన్న 7,000 కిలోమీటర్ల సముద్ర తీరం నిరంతర పర్యవేక్షణలో ఉంచాల్సిన అవసరం ఉంది. దీనికోసం అత్యాధునిక ఉపగ్రహాలు, డ్రోన్లు అవసరమవుతాయి. ఇవి లేకపోతే వ్యూహాత్మకంగా ముందుకు సాగలేము,” అని నారాయణన్ చెప్పారు. ఈ ఉపగ్రహాల సహాయంతో సరిహద్దు భద్రత, సముద్ర జలాల్లో చురుకైన కదలికలపై సమాచారం సేకరించి, తక్షణ చర్యలు తీసుకోవడం సాధ్యమవుతోంది.
ఇస్రో రూపొందించిన ఉపగ్రహాలు భద్రత పరంగా మాత్రమే కాదు, పౌర అవసరాలకూ అనేక సేవలు అందిస్తున్నాయని ఆయన వివరించారు. వ్యవసాయం, దూరవిద్య, దూరవైద్యం, వాతావరణ సూచనలు, విపత్తుల సమయంలో స్పందన వంటి రంగాల్లో ఇవి కీలకపాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఉపగ్రహాల సహకారంతో విపత్తుల సమయంలో జరిగే ప్రాణ నష్టం గణనీయంగా తగ్గిందని ఆయన గుర్తు చేశారు.
అంతరిక్ష రంగంలో భారత్ సాధించిన పురోగతిని గుర్తుచేస్తూ, చంద్రయాన్-1 ద్వారా చంద్రుడిపై నీటి అణువుల జాడను కనుగొన్న తొలి దేశంగా భారత్ నిలిచిందని చెప్పారు. ఇప్పటివరకు భారత్ 34 దేశాలకు చెందిన 433 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించిందని తెలిపారు. ప్రస్తుతం అమెరికాతో కలసి అత్యంత ఖరీదైన భూమిని చిత్రీకరించే ఉపగ్రహాన్ని అభివృద్ధి చేస్తుండగా, దీని ప్రయోగం భారత్ నుంచే జరగనుందని నారాయణన్ వెల్లడించారు.