మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ 69వ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. మీ 69వ జయంతి న మిమ్మల్ని స్మరించుకుంటూ…అంటూ ఎమోషనల్ అయ్యారు. ఈ అస్తిత్వం మీరు… ఈ వ్యక్తిత్వం మీరు… మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు… ఆజన్మాంతం తలుచుకునే అశ్రుఖనం మీరు… అంటూ పోస్ట్ పెట్టారు జూనియర్ ఎన్టీఆర్.

అటు హరికృష్ణ జయంతి సందర్భంగా… నారా చంద్రబాబు నాయుడు కూడా ట్వీట్ చేశారు. చైతన్య రథసారథి, రాజ్యసభ మాజీ సభ్యుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ 69వ జయంతి సందర్భంగా ఘననివాళి అర్పిస్తున్నానన్నారు చంద్రబాబు. పట్టుదలకు మారుపేరుగా నిలిచిన శైలి ఆయనకు ఎందరో అభిమానుల్ని సంపాదించిపెట్టిందని పేర్కొన్నారు. ప్రజాసేవలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న నందమూరి హరికృష్ణ తరతరాలకు గుర్తుండిపోయే నాయకుడు. సినిమా నటుడిగా కూడా ఆయన చూపిన అసమాన ప్రతిభ చిరస్మరణీయం. ఆయనకు నివాళులు అర్పిస్తున్నానని ట్వీట్ చేసారు.