తెలంగాణలోని పలు జిల్లాలలో మరో కొన్ని గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రంగారెడ్డి, భువనగిరి, నల్గొండ, వికారాబాద్ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఇప్పటికే మెదక్ జిల్లాలో 14 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదు అయింది. మరోవైపు హైదరాబాద్ లోను మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తెలంగాణ ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు. మరో మూడు గంటల పాటు భారీ వర్షం కురుస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కరీంనగర్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, ఖమ్మం, మహబూబ్ నగర్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాలలో మోస్తారు నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉంది. వర్షంతో పాటు ఈదురు గాలులు బలంగా వీచే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనాలు వేశారు.