పాము అంటే భూమిపై పాకే జీవి అనే మన అభిప్రాయాన్ని ప్రకృతి అద్భుతం పూర్తిగా మార్చేసింది. నిజానికి కొన్ని రకాల పాములు గాల్లో ఎగరగలవు. వినడానికి సినిమా కథలా ఉన్నా, ఇది నూటికి నూరు శాతం నిజం. ముఖ్యంగా ఆగ్నేయాసియా అడవుల్లో కనిపించే ఈ పాముల విన్యాసాల వెనుక ఉన్న సైన్స్ రహస్యం ఏమిటి? అవే నిజంగా పక్షుల్లా ఎగురుతాయా? ఈ ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
ఎగిరే పాముల రహస్యం: పాములకు రెక్కలు లేవు, అయినా అవి గాల్లో ఎలా ప్రయాణించగలుగుతాయి? వీటికి ‘ఫ్లయింగ్ స్నేక్స్’ లేదా ‘గ్లైడింగ్ స్నేక్స్’ అని పేరు. శాస్త్రీయంగా వీటిని ‘క్రైసోపీలియా’ జాతిగా పిలుస్తారు. ఇవి నిజానికి పక్షుల్లా ఎగరలేవు, కానీ ఒక చెట్టు కొమ్మపై నుంచి మరో చెట్టు కొమ్మపైకి దూకుతూ గాలిలో జారుతూ వెళతాయి. ఆలా దూకే ముందు, ఈ పాములు తమ శరీరాన్ని ‘J’ ఆకారంలో వంచి, గాలిలోకి దూకిన వెంటనే తమ దేహాన్ని ‘S’ ఆకారంలోకి మారుస్తాయి. అంతేకాదు వాటి పక్కటెముకలను వెనక్కి లాగి, తమ శరీర మధ్యభాగాన్ని చదునుగా చేసి, ఒక అర్ధ-వృత్తాకార రెక్కలాంటి ఆకృతిని ఏర్పరుచుకుంటాయి. ఈ ఏరోడైనమిక్ ఆకృతి కారణంగానే అవి గాలిలో సుమారు 100 మీటర్ల దూరం వరకు జారుకోగలుగుతాయి.

అద్భుతమైన ఏరోడైనమిక్స్: ఎగిరే పాములు గాలిలో జారుతూ వెళ్లేటప్పుడు నిరంతరం తమ శరీరాన్ని భూమికి సమాంతరంగా అలలు మాదిరిగా కదిలిస్తాయి. ఈ కదలికనే శాస్త్రవేత్తలు ఏరోడైనమిక్ శక్తిని ఉత్పత్తి చేయడంలో కీలకంగా గుర్తించారు. ఈ కదలిక వల్ల వాటికి గాలిలో స్థిరత్వం లభిస్తుంది, దిశను కూడా కొద్దిగా నియంత్రించుకోగలుగుతాయి. ఈ అసాధారణమైన సామర్థ్యం వారికి వేటాడటానికి, ముఖ్యంగా భూమిపై ఉండే శత్రువుల నుంచి తప్పించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇతర గ్లైడింగ్ జంతువుల కంటే కూడా ఈ పాములే మెరుగ్గా జారగలవని పరిశోధనలు చెబుతున్నాయి.
పాముల గ్లైడింగ్ సామర్థ్యం ప్రకృతిలోని అద్భుతమైన పరిణామ రహస్యాల్లో ఒకటి. ఈ అధ్యయనాల ద్వారా శాస్త్రవేత్తలు, చేతులు లేదా రెక్కలు లేని రోబోలను తయారు చేయడానికి సంబంధించిన కొత్త టెక్నాలజీ గురించి పరిశోధనలు చేస్తున్నారు. తక్షక్ నాగ్ వంటి కొన్ని పురాణ పాములకు రెక్కలు ఉంటాయనే నమ్మకాలు ఉన్నప్పటికీ, వాస్తవానికి ఈ పాములు రెక్కలు లేకుండా, కేవలం తమ శారీరక నిర్మాణాన్ని మార్చుకోవడం ద్వారానే గాల్లో ప్రయాణం చేస్తాయి.
గమనిక: ‘ఫ్లయింగ్ స్నేక్స్’ విషపూరితమైనవే అయినప్పటికీ, వాటి విషం సాధారణంగా మనుషులకు ప్రాణాంతకం కాదు. ఇవి చాలావరకు చెట్లపైనే నివసిస్తూ, మనుషులకు దూరంగా ఉంటాయి.
