హిందూ ధర్మంలో, కైలాసం శివుని పవిత్ర నివాసం. కానీ మనం శివుడిని తరచుగా భోగభాగ్యాలకు దూరంగా, కేవలం శ్మశానంలో (శ్మశాన వాటిక – రుద్రభూమి) నివసించే ‘శ్మశానవాసి’గా పూజిస్తాం. పరమశివుడు అత్యంత సుందరమైన కైలాసాన్ని విడిచి, మనిషి భయపడే ఆ ప్రదేశాన్ని ఎందుకు ఎంచుకున్నాడు? ఈ విచిత్రమైన ఎంపిక వెనుక శివ పురాణం బోధించిన ఆశ్చర్యపరిచే ఆధ్యాత్మిక అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
అన్ని బంధాలకు అంతిమ స్థానం: శివుడు లయకారకుడు. శ్మశానం అంటే ‘కాయాంత స్థానం’ – శరీరం అంతమయ్యే చోటు. శివ పురాణం ప్రకారం, ప్రతి ప్రాణి యొక్క భౌతిక అస్థిరతను తెలియజెప్పడానికే శివుడు శ్మశానాన్ని తన నివాసంగా చేసుకున్నాడు. ధనవంతుడైనా, పేదవాడైనా, రాజా, బిచ్చగాడైనా, అందరూ చివరికి చేరే చోటు శ్మశానమే. అక్కడ అన్ని రకాల అహంకారాలు, భౌతిక బంధాలు ముగిసిపోతాయి.
ప్రపంచంలో ప్రతి ఒక్కరూ విడిచిపెట్టే ఆ ప్రదేశంలో, శివుడు అక్కడ ధ్యానం చేస్తూ, వైరాగ్యాన్ని బోధిస్తాడు. అందుకే శివుడు ఒంటికి అగ్నిలో కాలిన శవాల బూడిదను (విభూది) రాసుకుంటాడు అంటే, మన శరీరం చివరికి బూడిదగానే మారుతుందని, కాబట్టి దేహంపై మోహం పెంచుకోవద్దని చెప్పడమే దీని అంతరార్థం.

ఆత్మకు శాంతి కల్గించే మార్గదర్శి: శ్మశానంలో శివుని నివాసం వెనుక ఉన్న మరో లోతైన అర్థం- ఆత్మలకు మోక్ష మార్గాన్ని చూపించడం. శరీరం నుంచి విడిపోయిన ఆత్మలు ఏ ఆధారం లేక అల్లల్లాడుతున్నప్పుడు, వాటికి శాంతి, మోక్షం లభించేలా భూతగణాలకు అధిపతి (భూతనాథుడు) అయిన శివుడు అక్కడ ఉంటాడు.
శ్మశానం అనేది భయంకరమైన ప్రదేశం అయినప్పటికీ, శివుడు దానిని పవిత్రమైన కైలాసంతో సమానంగా చూస్తాడు. ఇది భక్తులకు నిర్భయంగా ఉండాలని, మరణ భయాన్ని జయించాలని, జీవితంలోని పవిత్ర-అపవిత్ర అనే ద్వంద్వాలను అధిగమించాలని బోధిస్తుంది. ఈ విధంగా, శివుడు శ్మశానంలో ఉండి, జీవికి చివరి క్షణంలో కూడా తన కరుణను అందిస్తాడు.
శివుడిని భస్మాన్ని ధరించడానికి మరొక కారణం- పూర్వం దక్షుని యజ్ఞం తర్వాత సతీదేవి దేహాన్ని అగ్నిలో దహనం చేసిన బూడిదను శివుడు తన శరీరంపై రాసుకుని సతీ జ్ఞాపకార్థం శ్మశానంలో తపస్సు చేశాడని పురాణాలూ తెలుపుతున్నాయి.
శివుడు శ్మశానంలో నివసించడంలో ఉన్న ఆంతర్యం కేవలం పురాణ కథ కాదు అది మన జీవితానికి సంబంధించిన గొప్ప వేదాంత సారం. ఇది మనకు తెలుసుకోవలసిన అత్యంత ముఖ్యమైన సత్యం- మరణం అనేది జీవితంలో ఒక అంతం మాత్రమే కాదు, శరీరం అంతం మాత్రమే.
మనిషి ఆత్మ శాశ్వతమైనదని, మనం భౌతిక సుఖాలకు బానిసలం కాకుండా, నిజమైన ఆధ్యాత్మికతపై దృష్టి పెట్టాలని శివతత్వం చెబుతుంది. ఆ సత్యాన్ని గుర్తించినప్పుడే మన మనస్సులో శివుడు నిజమైన ఆశ్రయం పొందుతాడు.
