పవిత్ర కార్తీక మాసం అంటేనే దైవారాధనకు, ఆధ్యాత్మికతకు పేరుగాంచింది. ఈ మాసంలో చేసే ప్రతి పూజ, వ్రతం రెట్టింపు ఫలాన్ని ఇస్తాయని మన పెద్దలు చెబుతారు. మరి ఇలాంటి పవిత్ర సమయంలో శ్రీ సత్యనారాయణ వ్రతం ఆచరించడం వెనుక ఉన్న అద్భుతమైన ఫలితాలు, పౌరాణిక శక్తి ఏమిటో మీకు తెలుసా? సకల శుభాలు, కోరిన కోరికలు నెరవేర్చే ఈ వ్రత మహిమను తెలుసుకుందాం..
కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతం ప్రాముఖ్యత: కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతం ఆచరించడం అనేది అపారమైన పుణ్యాన్ని కలిగిస్తుందని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఈ వ్రతం సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు అవతారమైన సత్యనారాయణ స్వామిని పూజించడం. సత్యం అంటే నిజం నారాయణుడు అంటే భగవంతుడు. సత్యాన్ని నమ్మేవారికి భగవంతుని అనుగ్రహం లభిస్తుందని దీని అర్థం. కార్తీక మాసం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనది కాబట్టి ఈ సమయంలో చేసే ఈ వ్రతం ద్వారా గత జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రస్తుత జీవితంలో ఉన్న కష్టాలు, అడ్డంకులు తొలగిపోయి శాంతి సుఖం లభిస్తాయని నమ్మకం.

ఐశ్వర్యం మరియు సంపద: ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ వ్రతం ఆచరిస్తే, లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనలాభం, సంపద పెరుగుదల కలుగుతుందని ప్రతీతి.
కుటుంబ సౌఖ్యం మరియు శాంతి: కుటుంబంలో ఏర్పడే కలహాలు, మనస్పర్ధలు తొలగిపోయి, భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య ప్రేమ, అనుబంధం పెరుగుతాయి. ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది.
కోరికలు నెరవేరడం: సంతానం లేని వారికి సంతానం, వివాహం కాని వారికి వివాహం, ఉద్యోగం రాని వారికి ఉద్యోగం ఇలా కోరుకున్న కోరికలు సత్యనారాయణ స్వామి దయ వలన నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు.
కార్తీక మాసంలో మీరు ఏ రోజు ఈ వ్రతాన్ని ఆచరించినా అది మీకు శుభప్రదమే. ముఖ్యంగా పౌర్ణమి రోజున చేయడం అత్యంత శ్రేయస్కరం. కేవలం ఆడంబరం కోసం కాకుండా నిజమైన భక్తి, శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే సత్యనారాయణ స్వామి మీ జీవితాన్ని అద్భుతమైన ఫలితాలతో నిడుతుందని పురాణాలూ చెబుతున్నాయి.
