కళ్ళు మనకు ఈ ప్రపంచాన్ని చూసే భాగ్యాన్ని అందించే అద్భుతమైన వరం. కానీ నేటి డిజిటల్ యుగంలో ఎక్కువ స్క్రీన్ టైమ్ కారణంగా కంటి సమస్యలు, దృష్టి లోపం సర్వసాధారణమైపోయాయి. కంటి చూపును మెరుగుపరుచుకోవడానికి, కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కేవలం కంటి వ్యాయామాలు మాత్రమే సరిపోవు. సరైన ఆహారం తీసుకోవడం కూడా ముఖ్యమే. కంటి చూపును అద్దాల్లా స్పష్టంగా ఉంచడానికి మీ రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన పోషకాలు ఏమిటో తెలుసుకుందాం.
కంటి చూపు స్పష్టంగా ఉండాలంటే ఆహారంలో కొన్ని ముఖ్యమైన పోషకాలు తప్పనిసరిగా ఉండాలి. వాటిలో ముఖ్యమైనది విటమిన్-ఏ. ఇది రెటీనా సరిగ్గా పనిచేయడానికి తోడ్పడుతుంది, రాత్రిపూట చూపును మెరుగుపరుస్తుంది. క్యారెట్లు, చిలగడదుంపలు, ఆకుకూరలు (పాలకూర వంటివి) విటమిన్-ఏకి అద్భుతమైన వనరులు.

అలాగే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు అయిన లుటీన్ మరియు జియాక్సాంథిన్ కంటిలోని కణాలను దెబ్బతినకుండా రక్షిస్తాయి. వృద్ధాప్యం కారణంగా వచ్చే మ్యాక్యులార్ డీజెనరేషన్ (AMD) వంటి సమస్యలను నివారిస్తాయి. గుడ్లు, బ్రకోలీ మరియు ముదురు ఆకుపచ్చ కూరగాయలలో ఇవి సమృద్ధిగా లభిస్తాయి.
ఇక, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కళ్ళలోని పొడితనాన్ని తగ్గిస్తాయి. దృష్టి నాడీ ఆరోగ్యాన్ని కాపాడతాయి. చేపలు (సాల్మన్, ట్యూనా) అవిసె గింజలు, వాల్నట్లలో ఇవి ఉంటాయి. చివరగా విటమిన్-సి, విటమిన్-ఈ మరియు జింక్ కంటి కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడతాయి. నిమ్మకాయలు, నారింజ వంటి సిట్రస్ పండ్లు, బాదం పప్పులు చిక్కుళ్ళు వంటి వాటిని డైట్లో చేర్చుకోవడం ద్వారా మీ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుని అద్దాల్లాంటి స్పష్టమైన చూపును పొందవచ్చు.
గమనిక: ఆహారం కంటి ఆరోగ్యానికి తోడ్పడినప్పటికీ తీవ్రమైన దృష్టి లోపాలు లేదా కంటి సమస్యలు ఉంటే మాత్రం వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి. ఆరు నెలలకు ఒకసారి కంటి పరీక్ష చేయించుకోవడం ఉత్తమం.
