మీరు తరచుగా అకారణమైన అలసటతో బాధపడుతున్నారా? బరువు పెరగడం లేదా తగ్గడం గమనించారా? ఉదయం లేవగానే కీళ్ల నొప్పులు, మెడ భాగంలో అసౌకర్యం అనిపిస్తున్నాయా? ఈ లక్షణాలన్నీ వయస్సు లేదా అలసట వల్ల అని కొట్టిపారేయకండి. మన శరీరంలోని కీలకమైన విధులను నియంత్రించే థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయకపోవడానికి ఇవి సంకేతాలు కావచ్చు. సీతాకోకచిలుక ఆకారంలో ఉండే ఈ చిన్న గ్రంథి పనితీరులో తేడా వస్తే, మన శారీరక, మానసిక ఆరోగ్యం మొత్తం ఎలా ప్రభావితమవుతుందో తెలుసుకుందాం.
థైరాయిడ్ గ్రంథి తగినంత హార్మోన్లను ఉత్పత్తి చేయకపోతే (దీనిని హైపోథైరాయిడిజం అంటారు) శరీర జీవక్రియ (Metabolism) మందగిస్తుంది. ఈ మందగమనం కారణంగానే కీళ్ల నొప్పి, అలసట, బరువు పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. థైరాయిడ్ హార్మోన్లు తక్కువగా ఉన్నప్పుడు, శరీరంలో ద్రవాలు నిలిచిపోయి కీళ్ల చుట్టూ వాపు, నొప్పి లేదా కండరాల పట్టివేత సంభవించవచ్చు. ముఖ్యంగా, మోచేతులు, మోకాళ్లు, భుజాలలో దీర్ఘకాలిక నొప్పి ఉంటుంది.

అలాగే థైరాయిడ్ గ్రంథి యొక్క పరిమాణం పెరిగినప్పుడు లేదా వాపు వచ్చినప్పుడు, దానిని గాయిటర్ అంటారు. దీని కారణంగానే కొంతమందికి మెడ బరువుగా, ఉబ్బినట్లు అనిపించడం, మింగడంలో ఇబ్బంది లేదా గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. నిరంతర అలసట, బలహీనత, నిద్రలేమి చలికి సున్నితత్వం, జుట్టు రాలడం, డిప్రెషన్ మరియు మానసిక ఆందోళన కూడా థైరాయిడ్ అసమతుల్యత యొక్క సాధారణ లక్షణాలే.
కాబట్టి ఈ లక్షణాలు తరచుగా లేదా తీవ్రంగా కనిపిస్తే, కేవలం సాధారణ సమస్యగా భావించకుండా థైరాయిడ్ పరీక్ష చేయించుకోవడం చాలా అవసరం. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే, ఈ లక్షణాల నుండి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించవచ్చు.
గమనిక: పైన పేర్కొన్న లక్షణాలు ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా తలెత్తవచ్చు. ఈ లక్షణాలు మీకు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుడిని లేదా ఎండోక్రినాలజిస్ట్‌ను సంప్రదించి, వారి సలహా మేరకు పరీక్షలు మరియు చికిత్స తీసుకోవడం ఉత్తమం.
