మీ ఇంట్లో మీరు రోజువారీగా ఉపయోగించే వస్తువులు, అవి మనల్ని నిత్యం ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంచడానికి ఉపయోగపడతాయి. కానీ ఆ సాధారణ వస్తువులే మీకు లేదా మీ పిల్లలకు మత్తును, ప్రాణాంతకమైన ప్రమాదాన్ని కలిగించగలవని మీకు తెలుసా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది పచ్చి నిజం. కేవలం మందులు లేదా డ్రగ్స్ మాత్రమే కాకుండా మీ కిచెన్‌లో, బాత్‌రూమ్‌లో ఉండే కొన్ని వస్తువులు మత్తు కోసం దుర్వినియోగం అవుతున్నాయి. అవేంటో వాటి వల్ల కలిగే ప్రమాదాలేంటో తెలుసుకుందాం.
ఇంట్లో లభించే వస్తువులను మత్తు కోసం దుర్వినియోగం చేయడాన్ని ‘ఇన్హేలెంట్ అబ్యూస్’ అని అంటారు. ఈ విధానంలో కొన్ని ఉత్పత్తుల నుండి వచ్చే రసాయన ఆవిరులను పీల్చడం జరుగుతుంది. యువత, ముఖ్యంగా టీనేజర్లు దీనికి ఎక్కువగా బానిసలవుతున్నారు. అత్యంత సాధారణంగా దుర్వినియోగమయ్యే కొన్ని వస్తువులు తెలుసుకోవటం ముఖ్యం
పలుచని ద్రావకాలు (Solvents): నెయిల్ పాలిష్ రిమూవర్, పెయింట్ థిన్నర్లు, గమ్ లేదా అంటుకునే పదార్థాలలో ఉండే రసాయనాలు.

ఏరోసోల్ స్ప్రేలు : హెయిర్ స్ప్రేలు, డియోడరెంట్లు, వంట గదిలో ఉపయోగించే వంట నూనె స్ప్రేలు.
శుభ్రపరిచే ఉత్పత్తులు: డ్రై క్లీనింగ్ ద్రావకాలు, కొన్ని రకాల గది ఫ్రెష్నర్లు. ఇక ఇంధనాలు గ్యాసోలిన్ లేదా లైటర్ ఫ్లూయిడ్.
ఈ వస్తువుల నుండి వచ్చే ఆవిరులు కేంద్ర నాడీ వ్యవస్థ పై త్వరగా ప్రభావం చూపి, తక్కువ వ్యవధిలో తాత్కాలిక మత్తును కలిగిస్తాయి. దీని వల్ల తల తిరగడం, సమన్వయం కోల్పోవడం, ఉల్లాసంగా అనిపించడం జరుగుతుంది.
ఈ రసాయనాలను పీల్చడం వల్ల కలిగే ప్రమాదాలు చాలా తీవ్రమైనవి. మత్తు కోసమే కాకుండా, ఇంట్లో పసిపిల్లలు వాటిని చేరితే అనుకోకుండా పీల్చే ప్రమాదం కూడా ఉంది. ‘సడెన్ స్నిఫింగ్ డెత్’ అని పిలవబడే పరిస్థితి ద్వారా మొదటిసారే వాడినప్పటికీ కూడా గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది.
అంతేకాక దీర్ఘకాలికంగా మెదడు, కాలేయం మరియు మూత్రపిండాలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. ఈ విషయంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అవగాహన పెంచుకోవాలి. యువతకు దీని వల్ల కలిగే ప్రమాదాల గురించి వివరించి వారిని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది.
