మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రాణవాయువు ఎంత ముఖ్యమో, ఆ గాలిని లోపలికి పంపే ముక్కు ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. పెరుగుతున్న కాలుష్యం, మారుతున్న వాతావరణం వల్ల చాలా మంది జలుబు సైనస్, అలర్జీ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముక్కు కేవలం శ్వాస తీసుకోవడానికే కాదు గాలిని శుద్ధి చేసి శరీరానికి తగిన ఉష్ణోగ్రతలో పంపే ఫిల్టర్ లాంటిది. ఈ సున్నితమైన అవయవాన్ని మనం ఎలా కాపాడుకోవాలో శ్వాస ఇబ్బందులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం సులభంగా తెలుసుకుందాం.
ముక్కు సంరక్షణలో మొట్టమొదటి సూత్రం దానిని తేమగా ఉంచుకోవడం. పొడి గాలి లేదా ఏసీల వల్ల ముక్కు లోపలి పొరలు ఎండిపోయి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. దీనిని నివారించడానికి ‘నేసల్ సెలైన్ స్ప్రే’ లేదా ఆవిరి పట్టడం వంటి పద్ధతులు అద్భుతంగా పనిచేస్తాయి.
ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటితో ఆవిరి పడితే శ్వాసనాళాలు శుభ్రపడి గాఢ నిద్ర పడుతుంది. బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడం వల్ల ధూళి కణాలు, అలర్జీ కారకాలు ముక్కులోకి వెళ్లకుండా అడ్డుకోవచ్చు. అందరు మాస్క్ అంటే కరోనా వల్ల అనుకుంటారేమో అని పెట్టుకోవటం మానేస్తున్నారు కానీ, మాస్క్ అంటే కోవిడ్ కోసం కాదు. ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం కూడా చాలా అవసరం.

ఆయుర్వేదం సూచించిన ‘నస్యం’ అనే ప్రక్రియ ముక్కు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజూ ఉదయం లేదా రాత్రి పడుకునే ముందు రెండు చుక్కల నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యిని ముక్కు రంధ్రాలలో వేసుకోవడం వల్ల నాసికా మార్గం మృదువుగా మారుతుంది. ఇది సైనస్ సమస్యలను తగ్గించడమే కాకుండా జ్ఞాపకశక్తిని, కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది.
అలాగే, ప్రాణాయామం వంటి శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరిగి, ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది. ముక్కును శుభ్రం చేసుకునేటప్పుడు అతిగా ఒత్తిడి చేయడం తగ్గించాలి. కొందరు తెలిసో తెలియకో వేళ్లు ముక్కులో పెట్టుకోవటం వంటివి చేస్తుంటారు అది మానుకోవాలి ఎందుకంటే అది లోపలి సున్నితమైన రక్తనాళాలను దెబ్బతీస్తుంది.
ఇక ముక్కు ఆరోగ్యమే మన మొత్తం శ్వాస వ్యవస్థకు పునాది. మనం తీసుకునే గాలి ఎంత స్వచ్ఛంగా ఉంటే మన రక్తం అంత శుద్ధి అవుతుంది. చిన్నపాటి జాగ్రత్తలు, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని పాటిస్తే సైనస్, ఆస్తమా వంటి దీర్ఘకాలిక సమస్యల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.
గమనిక: మీకు తరచుగా ముక్కు దిబ్బడ వేయడం, రక్తం రావడం లేదా వాసన తెలియకపోవడం వంటి లక్షణాలు ఉంటే, అవి తీవ్రమైన ఇన్ఫెక్షన్ లేదా ‘నేసల్ పాలిప్స్’ సంకేతం కావచ్చు. అటువంటప్పుడు ఆలస్యం చేయకుండా ఇ.ఎన్.టి (ENT) డాక్టర్ను సంప్రదించడం శ్రేయస్కరం.
