రథసప్తమి అంటేనే సూర్య భగవానుడి జన్మదినంగా భావించే రోజు. ఇది మన సంప్రదాయంలో ఎంతో విశిష్టమైనది రోజు. మాఘ మాసంలో వచ్చే ఈ పర్వదినం కేవలం ఒక పండుగ మాత్రమే కాదు ఆరోగ్యాన్ని ఆయుష్షును ప్రసాదించే ఒక దివ్య శక్తి సముపార్జన అని పెద్దలు చెప్తారు. చలికాలం ముగిసి భానుడి కిరణాలు తీక్షణంగా మారుతున్న వేళ, ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా మన శరీరాన్ని సిద్ధం చేసే అద్భుత ఆధ్యాత్మిక ప్రక్రియ ఇది. మరి ఆ సూర్య నారాయణుడిని ఎలా పూజించాలో ఇప్పుడు చూద్దాం.
రథసప్తమి సంప్రదాయ స్నానం మరియు సంకల్పం: రథసప్తమి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి నదీ స్నానం లేదా గృహంలోనే పవిత్ర స్నానం ఆచరించాలి. ఈ రోజున ముఖ్యంగా ఏడు జిల్లేడు ఆకులను,చిక్కుడు ఆకులను (తల మీద ఒకటి, భుజాల మీద రెండు మోకాళ్ల మీద రెండు, పాదాల మీద రెండు) ధరించి స్నానం చేయడం శుభప్రదం.
జిల్లేడు ఆకులకు ‘అర్క’ పత్రాలని పేరు, ఇది సూర్యుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఇలా చేయడం వల్ల గత ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని, చర్మవ్యాధులు దరిచేరవని భక్తుల నమ్మకం. స్నానానంతరం శుభ్రమైన వస్త్రాలు ధరించి ఇంటి ముంగిట రంగురంగుల ముగ్గులతో సూర్యరథాన్ని తీర్చిదిద్ది పూజకు సిద్ధం కావాలి.

సూర్య భగవానుడి పూజ, నైవేద్య విధానం: పూజ గదిలో సూర్య యంత్రాన్ని లేదా సూర్యుడి ప్రతిమను ఉంచి షోడశోపచార పూజ చేయాలి. ఈ క్రమంలో అష్టోత్తర శతనామావళిని పఠిస్తూ ఎర్రటి పూలతో అర్చించడం విశేష ఫలితాన్నిస్తుంది. రథసప్తమి నాడు మరో ముఖ్యమైన ఘట్టం ‘పరమాన్నం’ వండటం.
పొయ్యిని బయట ఎండలో ఉంచి, కొత్త కుండలో పాలు పోసి, అవి పొంగిన తర్వాత బియ్యం, బెల్లం వేసి నైవేద్యం తయారు చేయాలి. ఈ పాలు పొంగే దిశను బట్టి ఆ సంవత్సరం ఫలితాలను అంచనా వేస్తారు. అనంతరం సూర్యుడికి నైవేద్యం సమర్పించి, ఆదిత్య హృదయం లేదా సూర్యాష్టకాన్ని పఠించడం ద్వారా మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తాయి అని పండితులు తెలుపుతున్నారు.
రథసప్తమి విశిష్టత: సూర్యుడు తన దిశను మార్చుకుని ఉత్తరాయణ పుణ్యకాలంలో తన రథాన్ని ముందుకు నడిపే రోజే ఈ రథసప్తమి. ఈ రోజున చేసే దానధర్మాలకు అనంతమైన పుణ్యం లభిస్తుందని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా చిక్కుడు కాయలతో రథం చేసి సమర్పించడం, గోధుమలతో చేసిన పదార్థాలను పంచిపెట్టడం ఉత్తమం. సూర్యరశ్మి ద్వారా లభించే విటమిన్-డి మనల్ని ఆరోగ్యంగా ఉంచినట్టే, సూర్యారాధన మన అంతరాత్మను ప్రకాశింపజేస్తుంది.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగహన కోసం మాత్రమే, పూర్తి సమాచారం కోసం స్థానిక పురోహితులను సంప్రదించవలసిందిగా మనవి.
