శాకాహారులకు మటన్ లాంటి రుచిని ఇచ్చే పదార్థంగా చెప్పుకునే పుట్టగొడుగుల గురించి మనం విని వుంటాం. కానీ వీటిలో రుచిని మించిన అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయని మీకు తెలుసా? చాలామందికి పుట్టగొడుగులు కేవలం ఒక రుచికరమైన కూర మాత్రమే. నిజానికి, వీటిని సూపర్ ఫుడ్స్ అని పిలవవచ్చు. విటమిన్-డి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పుట్టగొడుగులు అనేక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు చెక్ పెడతాయి. నేటి ఆధునిక జీవనశైలిలో మనల్ని వేధించే ఒత్తిడి బలహీనమైన రోగనిరోధక శక్తిని ఎదుర్కోవడానికి పుట్టగొడుగులు ఒక అద్భుతమైన మందులా పనిచేస్తాయి.
పుట్టగొడుగుల్లో ఉండే సెలీనియం మరియు ఎర్గోథియోనిన్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని కణాల దెబ్బతినకుండా కాపాడతాయి. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లను తట్టుకోవడానికి ఇది రోగనిరోధక శక్తిని రెట్టింపు చేస్తుంది.

అలాగే, వీటిలో పొటాషియం అధికంగా, సోడియం తక్కువగా ఉండటం వల్ల రక్తపోటు (BP) అదుపులో ఉంటుంది. పీచు పదార్థం (ఫైబర్) ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది తక్కువ కేలరీల ఉత్తమ ఆహారం.
ఇటీవలి పరిశోధనల ప్రకారం, క్రమం తప్పకుండా పుట్టగొడుగులు తినేవారిలో జ్ఞాపకశక్తి పెరగడమే కాకుండా వయస్సుతో పాటు వచ్చే అల్జీమర్స్ వంటి మెదడు వ్యాధుల ముప్పు తగ్గుతుందని తేలింది. వీటిలో ఉండే ప్రత్యేకమైన పోషకాలు నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తాయి.
అంతేకాకుండా, పుట్టగొడుగుల్లో ఉండే ‘బీటా-గ్లూకాన్స్’ శరీరంలోని క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడంలో సహాయపడతాయి. ముఖ్యంగా మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్ నివారణకు ఇవి తోడ్పడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. సహజంగా విటమిన్-డి లభించే అతి తక్కువ శాకాహార వనరులలో పుట్టగొడుగులు ఒకటి కావడం విశేషం.
గమనిక: రుచితో పాటు అపారమైన ఆరోగ్యాన్ని ఇచ్చే పుట్టగొడుగులను మన రోజువారీ భోజనంలో భాగం చేసుకోవడం ఎంతో మంచిది. అయితే వీటిని కొనేటప్పుడు, అవి నాణ్యమైనవని నిర్ధారించుకోవాలి.
