ప్రస్తుత తరుణంలో ఆరోగ్యం విషయంలో అనేక మంది శ్రద్ధ చూపిస్తున్నారు. ముఖ్యంగా నిత్యం వాడే వంట నూనెల విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నారు. అందులో భాగంగానే రీఫైన్డ్ ఆయిల్స్ కాకుండా గానుగలో ఆడించిన సహజసిద్ధమైన నూనెలను వాడేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. వీటి ధర ఇతర వంట నూనెలతో పోలిస్తే కాస్త ఎక్కువే. అయినప్పటికీ ఆరోగ్యంగా ఉండేందుకు జనాలు గానుగలో ఆడించిన వంట నూనెలను వాడేందుకే ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు. అయితే ఇదే గానుగ నూనె తయారు చేసి అమ్మే బిజినెస్ చేస్తే.. ఎవరైనా సరే.. చక్కని ఆదాయం సంపాదించవచ్చు. మరి.. అదెలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
గానుగ నూనె తయారు చేసేందుకు 10 * 10 సైజ్ ఉన్న గది చాలు. ఇంట్లోనూ స్థలం ఉంటే మెషిన్ పెట్టుకుని ఈ వ్యాపారం చేయవచ్చు. ఇక ఈ మెషిన్ కెపాసిటీని బట్టి ఖరీదు ఉంటుంది. 10, 15, 20 కేజీల మెషిన్లు రూ.1.50 లక్షలు మొదలుకొని మనకు అందుబాటులో ఉన్నాయి. 20 కేజీల మెషిన్‌తో అయితే ఎక్కువ నూనెను ఒకేసారి ఉత్పత్తి చేయవచ్చు. ఇక కేవలం ఒక్కరు ఉన్నా చాలు.. ఈ మెషిన్‌ను ఆపరేట్ చేసుకోవచ్చు. ఇందుకు కరెంట్, ముడి పదార్థాలు ఖర్చవుతాయి. మహిళలు, నిరుద్యోగులు ఈ బిజినెస్‌తో చక్కని స్వయం ఉపాధి పొందవచ్చు.
గానుగలో నూనె తీయగా వచ్చే చెక్కను కిలో రూ.25 నుంచి రూ.30 చొప్పున డైరీ ఫామ్‌లు, హోటల్స్ కు అమ్మితే ఆ విధంగా కూడా లాభం వస్తుంది. లేదా సొంతంగా నువ్వులు, పల్లీల చెక్కలతో ఉండలు తయారు చేసి కూడా అమ్మవచ్చు. అలా కూడా ఆదాయం వస్తుంది. ఇక గానుగలో నూనె తీసే బిజినెస్‌కు ఎలాంటి పర్మిషన్లు అవసరం లేదు. మహిళలు, నిరుద్యోగులు సులభంగా ఈ వ్యాపారం చేసుకోవచ్చు. నెల నెలా స్వయం ఉపాధి కింద చక్కని ఆదాయం లభిస్తుంది..!