వ్యవసాయం చేయడం అంటే చాలా మంది దండగ అని ప్రస్తుతం భావిస్తున్నారు. కానీ నిజానికి ఆలోచన అంటూ ఉండి కష్టపడి ఒక రీతిలో వ్యవసాయం చేయాలేగానీ దానంత లాభసాటి వృత్తి మరొకటి ఉండదు. అవును.. సరిగ్గా ఇలా అనుకున్నాడు కాబట్టే విదేశాల్లో చేస్తున్న కార్పొరేట్ జాబ్‌ను కూడా వదిలి ఇండియాకు వచ్చాడు. కొద్ది కొద్దిగా భూమిని కౌలుకు తీసుకుని నిమ్మకాయలు, ఇతర పంటలను పండించడం మొదలు పెట్టాడు. ఇప్పుడు ఏటా రూ.లక్షల ఆదాయం ఆర్జిస్తున్నాడు. ఇతర రైతులకు అతను ఆదర్శంగా నిలుస్తున్నాడు.
కేరళలోని కొట్టాయంకు చెందిన బాబు 15 ఏళ్ల పాటు బహ్రెయిన్, పోర్చుగల్, డెన్మార్క్ తదితర దేశాల్లో పలు కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేశాడు. అయితే అతనికి వ్యవసాయం మీద ఆసక్తి ఉండడంతో ఇండియాకు తిరిగి వచ్చాడు. సొంత ఊర్లో ముందుగా 7 సెంట్ల భూమిని కౌలుకు తీసుకున్నాడు. అందులో 14 నిమ్మకాయ మొక్కలను నాటాడు. తరువాత నెమ్మదిగా భూమి విస్తీర్ణం పెంచాడు. ఒక్కో చెట్టు నుంచి సుమారుగా 80 నుంచి 100 కిలోల నిమ్మకాయలను పండిస్తూ ఒక్కో కిలో నిమ్మకాయలను రూ.100 కు అమ్ముతూ లాభాలను గడిస్తున్నాడు. అలా అతను నిమ్మకాయల సాగులో విజయం సాధించాడు.
సాధారణంగా ఇతర పంటలు అయితే సీజనల్‌గా వేయాల్సి ఉంటుంది. అలాగే కోతులు, ఎలుకలు, గబ్బిలాల బెడద ఉంటుంది. కానీ నిమ్మ పంటకు వాటి బెడద ఉండదు. ఆ మొక్కలకు ముళ్లు ఉంటాయి. కనుక అలాంటి జీవుల బాధ ఉండదు. దీనికి తోడు నిమ్మకాయలను ఏడాది మొత్తం పండించవచ్చు. అందువల్ల ఏడాదంతా పంట తీయవచ్చు. అలాగే నిమ్మకాయలకు మార్కెట్‌లో ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. అందువల్లే అతను నిమ్మకాయలను పండించడం మొదలు పెట్టాడు. అందులో సక్సెస్ అయ్యాడు. ఈ క్రమంలోనే నిమ్మకాయల పంట ద్వారా ప్రస్తుతం అతను ఏడాదికి కొన్ని లక్షల రూపాయల ఆదాయం ఆర్జిస్తున్నాడు.
ఇక బాబు లెమన్ మీడోస్ పేరిట ఓ నర్సరీని పెట్టి నిమ్మ పంట వేయాలనుకునే వారికి మొక్కలను పంపిణీ చేస్తున్నాడు. ఇతర రైతులకు పంట సాగులో మెళకువలను చెబుతున్నాడు. దీంతో చాలా మంది అతని దగ్గరికి నిమ్మ మొక్కలను తీసుకునేందుకు, ఆ మెళకువలను తెలుసుకునేందుకు వస్తున్నారు. ఇక బాబు ప్రస్తుతం కేవలం నిమ్మకాయలే కాకుండా జామకాయలు, రాంబుటన్స్, పాషన్ ఫ్రూట్స్, ఎరికా నట్స్, విత్తనాలు లేని నిమ్మకాయలు తదితర పంటలను కూడా పండిస్తూ లాభాలు గడిస్తున్నాడు. నిజంగా కొత్తగా వ్యవసాయం చేయాలనుకునే వారు ఇతన్ని ఆదర్శంగా తీసుకోవచ్చు.