లాక్ డౌన్ తరువాత టాలీవుడ్ కు మళ్లీ ఆశలు చిగురించేలా చేసిన సినిమా ‘ అఖండ’. నందమూరి నటసింహం బాలకృష్ణ ఫవర్ ఫుల్ యాక్షన్.. బోయపాటి శ్రీను దర్శకత్వ ప్రతిభ, థమన్ మ్యూజిక్ ఇలా అన్నీ కలిసి ‘ అఖండ’ సినిమాకు సాలిడ్ హిట్ అందిచాయి. బాలయ్య ‘ అఖండ’ ఇచ్చిన ఊపుతో పెద్ద సినిమాల నిర్మాతలకు, హీరోలకు తమ సినిమాల మీద కలెక్షన్ల పరంగా నమ్మకాన్ని చిగురించేలా చేశాయి. ప్రస్తుత కాలంలో ఓ సినిమా వంద రోజులు పూర్తి చేసుకోవడం చాలా అరుదు. అలాంటి నయా రికార్డ్ ను బాలయ్య మరోసారి నెలకొల్పాడు. గతేడాది డిసెంబర్ 2న విడుదలైన ఈసినిమా భారీ కలెక్షన్లు రాబట్టింది. ఏ సెంటర్ అయినా.. జై బాలయ్య నినాదాలతో దద్దరిల్లిపోయింది.
ఇదిలా ఉంటే ‘ అఖండ’ వందరోజులకు చేరువ అవుతున్న తరుణంలో కృతజ్ఞత సభ నిర్వహించేందుకు చిత్రయూనిట్ రెడీ అయింది. మార్చి 12న ఎస్టీబీసీ గ్రౌండ్ కర్నూల్ లో భారీ సభకు ప్లాన్ చేసింది. సాయంత్రం 5 గంటల నుంచి ఈ సభ ప్రారంభం కానుంది. దీంతో బాలయ్య అభిమానులకు మరో పండగ వచ్చినట్లే ఇక.