బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హత్యకు బిష్ణోయ్ గ్యాంగ్ కుట్ర పన్నిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌లో సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దర్యాప్తులో ఒళ్లు జలదరించే వాస్తవాలు బయటపడ్డాయి. నవీ ముంబయి పోలీసులు దాఖలు చేసిన 350 పేజీల ఛార్జిషీట్‌లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ఛార్జిషీట్లో పోలీసులు ప్రస్తావించిన విషయాలు ఇవే..
సల్మాన్ హత్యకు ఆ గ్యాంగ్ పక్కా ప్లానింగ్‌తో వ్యవహరిస్తోందని పోలీసులు తెలిపారు. అచ్చంగా పంజాబీ సింగర్ సిద్ధూమూసేవాలా హత్య తరహాలోనే కారులో హత్య చేయాలని నిర్ణయించినట్లు గుర్తించినట్లు చెప్పారు. ఇందుకోసం మైనర్లను షార్పు షూటర్లుగా వాడేందుకు ఈ గ్యాంగ్ ఏర్పాట్లు చేసిందని వెల్లడించారు.
“సినిమా షూటింగ్‌లు లేదా పన్వేల్ ఫామ్ హౌస్‌కు సల్మాన్ రాకపోకలు సాగిస్తున్న వేళ ఈ కుట్రను అమలు చేయాలనుకుంది. ఇక హత్యకు రూ.25 లక్షల కాంట్రాక్టు కూడా ఇచ్చింది. 2023 ఆగస్టు నుంచి 2024 ఏప్రిల్ మధ్య రూపొందించింది. తుర్కియే (టర్కీ) నుంచి జిగాన పిస్టోళ్లను తెప్పించేందుకు పథకం సిద్ధం చేసింది.” అని పోలీసులు తెలిపారు.