స్టార్ హీరోయిన్ నయనతార దంపతులు ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చారని నిన్న విఘ్నేశ్ శివన్ సోషల్ మీడియాలో ప్రకటించారు. తక్కువ సమయంలోనే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. స్టార్ హీరోయిన్ నయనతార దంపతులకు పెళ్లై నాలుగు నెలలు మాత్రమే అయ్యింది. ఈ గ్యాప్ లో నయన్ తాలూకూ బేబీ బంప్ ఫొటోలు కూడా ఎక్కడా కనిపించలేదు.
ఉన్నట్టుండి తల్లిదండ్రులమయ్యాం అని గుడ్ న్యూస్ చెప్పారు కానీ ఎలా అన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. తర్వాత సరోగసి ద్వారానే నయనతార తల్లైందని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ సరోగసి విధానం ద్వారా తల్లిదండ్రులైన సినీ సెలబ్రిటీలు ఎవరు అన్నది చూద్దాం.
ప్రస్తుతం హాలీవుడ్లో సత్తా చాటుతున్న ప్రియాంక చోప్రా సైతం సరోగాట్ పద్ధతిని సెలక్ట్ చేసుకున్నారు. నిక్ ప్రియాంక సరోగసి ద్వారానే పిల్లలను కన్నారు. మంచు లక్ష్మి కూడా సరోగసి ద్వారా బిడ్డను కన్నారు. సన్నీలియోన్ ఒక పాపను దత్తత తీసుకుని మిగతా పిల్లలను కనేందుకు సరోగసి మెథడ్ ను సెలక్ట్ చేసుకున్నారు.
బాలీవుడ్ బాద్షా షారుక్ దంపతులు మూడో కుమారుడిని సరోగసి ద్వారా పొందారు. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కిరణ్ రావు సరోగసి ద్వారా కుమారుడికి జన్మనిచ్చారు. బాలీవుడ్ సొట్టబుగ్గల సుందరి ప్రీతిజింటా కూడా ఇదే విధానంలో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. బ్యాచిలర్ గా ఉన్న హిందీ నటుడు తుషార్ కపూర్ సైతం ఈ విధానం ద్వారానే కొడుకును కన్నాడు.
తుషార్ సోదరి ఏక్తా కపూర్ కూడా ఇలాగే బిడ్డను పొందింది వీరిద్దరికీ సరోగేట్ మదర్ ఒక్కరే కావడం విశేషం. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ సైతం పెళ్లికాకుండానే సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యారు. భార్యకు ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు భర్త వీర్యాన్ని మరో మహిళ గర్భంలోకి ప్రవేశపెట్టడం ద్వారా బిడ్డను పుట్టించే విధానాన్ని ట్రెడిషనల్ సరోగసి అంటారు.
బిడ్డ కావాలనుకునే దంపతుల్లో స్త్రీ అండాన్ని పురుషుడి స్పెర్మ్‌తో ఫలదీకరణం చెందించిన తర్వాత పిండాన్ని మరో మహిళ గర్భాశయంలో పెంచే విధానాన్ని జెస్టేషనల్ సరోగసి అంటారు. ఫిజిక్ కాపాడుకునేందుకు కొందరు ఇతరత్రా కారణాలతో మరికొందరు ఈ విధానాన్ని ఎంచుకుంటున్నారు.