కూటమి ప్రభుత్వం తొలి బడ్జెట్ సంఖ్య ఘనం – కేటాయింపులు శూన్యం. అంతా అంకెల గారడి.. అభూత కల్పన. దశ – దిశ లేని.. పస లేని బడ్జెట్ ఇది అని APCC చీఫ్ YS షర్మిల అన్నారు. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా, ఎన్నికల వాగ్దానాలను పూర్తిగా విస్మరించారు. సూపర్ సిక్స్ పథకాలకు పంగనామాలు పెట్టారు. ఇతర హామీలకు ఎగనామం పెట్టారు. ఇది మంచి ప్రభుత్వం కాదు.. ముంచే ప్రభుత్వం అని తొలి బడ్జెట్‌తోనే నిరూపితం అయ్యింది.
అన్నదాత సుఖీభవ పథకానికి కేవలం రూ.6,300 కోట్లు కేటాయించడం అరకొరనే. రాష్ట్రంలో 54 లక్షల మంది రైతులు ఎదురుచూస్తుంటే.. రూ.11 వేల కోట్లు నిధులు కావాల్సి ఉంటే.. కేంద్రం ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ కోసం రైతులను నిరీక్షణకు గురి చేయడం అన్యాయం. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతుంటే.. రూ.300 కోట్లు ధరల స్థిరీకరణ నిధికి ఇవ్వడం ద్రోహమే అని YS షర్మిల పేర్కొన్నారు.