మరో సౌత్ రీమేక్‌లో జాన్వీ కపూర్.. ఈసారి యాక్టింగ్ అదరగొట్టేసింది..!

-

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ మరో కొత్త సినిమా అప్డేట్ తో మనముందుకొచ్చింది. మరో సౌత్ సినిమా రీమేక్ తో తన ఫ్యాన్స్ ని అలరించడానికి రెడీ అయింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన సర్వైవల్ థ్రిల్లర్ ‘హెలెన్’కు రీమేక్‌గా.. ‘మిలీ’ పేరుతో తెరకెక్కించిన సినిమాలో జాన్వీ నటించింది. ఈ సినిమా టీజర్ విడుదలై.. ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది. పొరపాటున ఫ్రీజర్‌లో చిక్కుకుపోయిన అమ్మాయి తన ప్రాణాలు ఎలా కాపాడుకుంది అనేదే ఈ సినిమా కథాంశం.

జాన్వీ కపూర్ తో పాటు మనోజ్ పహ్వా, సన్నీ కౌశల్, హస్లీన్ కౌర్, రాజేష్ జైస్, సంజయ్ సూరీలు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. మలయాళంలో ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన మతుకుట్టి గ్జేవియర్ హిందీ వెర్షన్‌కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు స్వరాలను అందిస్తుండటం విశేషం. నవంబర్ 4వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

ఈ సినిమాను బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్‌పై జాన్వీ తండ్రి బోనీ కపూర్ స్వయంగా నిర్మిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్ఫణలో ఈ సినిమా తెరకెక్కింది. సౌత్ రీమేక్ లో నటించడం జాన్వీ కపూర్‌కు ఇది రెండోసారి. తన ముందు సినిమా ‘గుడ్ లక్ జెర్రీ’ కూడా తమిళ సినిమా ‘కొలమావు కోకిల’కు రీమేక్‌గా తెరకెక్కింది. అయితే ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే విడుదల అయింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ దీని డైరెక్ట్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసింది.

ఇప్పటివరకు జాన్వీ కపూర్ ఆరు సినిమాల్లో నటించగా వాటిలో మూడు సినిమాలు రీమేక్‌లే. మొదటి సినిమా ‘ధడక్’ మరాఠీ సూపర్ హిట్ ‘సైరాట్‌’కు రీమేక్. ‘గుడ్ లక్ జెర్రీ’, ‘మిలీ’ కూడా రీమేక్‌లే. జాన్వీ తొలి తెలుగు సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. తెలుగులో సినిమా చేయడానికి కూడా జాన్వీ చాలా ఆసక్తిగా ఉంది. ఈ విషయాన్ని ఆమె చాలా ఇంటర్వ్యూలలో చెప్పింది. ముఖ్యంగా మణిరత్నం సినిమాలో నటించాలనేది తన కల అని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.

Read more RELATED
Recommended to you

Exit mobile version