చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి (28) హత్య కేసులో అరెస్టయిన నటుడు దర్శన్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. పరప్పన అగ్రహార కారాగారంలో ఆయనకు ప్రత్యేక బ్యారక్‌ను కేటాయించారు. ఇతర ఖైదీల బ్యారక్‌లో ఉంచితే, వారి నుంచి సమస్యలు వస్తాయని ప్రత్యేక బ్యారక్‌ను దర్శన్, మరో నటుడు ప్రదోశ్‌కు కేటాయించామని అధికారులు వెల్లడించారు. విచారణ ఖైదీగా ఉన్న అతనికి 6106 నంబరును కేటాయించినట్లు చెప్పారు. హత్య కేసులో దర్శన్ అరెస్టయి ఇప్పటికే రెండు వారాలు పూర్తయింది. ఆయన బరువు కొంత తగ్గగా, రక్తపోటు కూడా నియంత్రణలో లేదని అధికారులు గుర్తించారు.
మరోవైపు హత్య కేసులో నిందితులు 17 మంది కాగా, అందరూ పరప్పన అగ్రహార కారాగారంలోనే ఉన్నారు. మహిళా బ్యారక్‌లో ఉన్న పవిత్రా గౌడ ఇతర ఖైదీలతో కలవకుండా, ఒంటరిగా , రోదిస్తూ ఉంటోందని కారాగార సిబ్బంది తెలిపారు. జూన్ ఎనిమిదిన హత్య అనంతరం కొందరు సాక్షులను నిందితులు బెదిరించారని, కొందరు నిందితులు హత్య అనంతరం రక్తం మరకలు ఉన్న తమ దుస్తులను కాల్చివేసి, కొత్త దుస్తులు కొనుగోలు చేసుకున్నారని పోలీసులు గుర్తించారు. సాక్షులకు ప్రాణహాని ఉండడంతో వారి వివరాలను గోప్యంగా ఉంచామని నగర పోలీసు కమిషనర్ దయానంద్ తెలిపారు.