బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు ఇటీవల పలుమార్లు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు బ్రిటన్‌లోని ఓ వైద్యవిద్యార్థిని నిందితుడిగా గుర్తించారు. అతడిపై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. అతడి స్వస్థలం హరియాణా. ఆ విద్యార్థిని ఇండియాకు తీసుకురావడానికి పోలీసులు చర్యలు చేపట్టారు.
గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ పేరిట అతడు సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు ఈ-మెయిల్ పంపినట్టు సమాచారం. గతనెల సల్మాన్‌ఖాన్‌కు ఓ బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. అందులో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అనుచరుడు గోల్డీ బ్రార్‌తో ముఖాముఖి మాట్లాడి వ్యవహారాన్ని చక్కబెట్టుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని సల్మాన్‌ను బెదిరించారు.
తొలుత ఈ కేసులో రాజస్థాన్‌కు చెందిన ధకడ్ రామ్ బిష్ణోయ్‌ను నిందితుడిగా గుర్తించిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఇటీవల కూడా సల్మాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. దుండగుడు ఏకంగా ముంబయి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి సల్మాన్‌ను చంపేస్తామని బెదిరించాడు. ఈ కేసులో 16 ఏళ్ల కుర్రాడిని నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.