మహానటి మరో రేర్ ఫీట్‌ని అందుకుంది. చైనాలోని అత్యంత ప్రిస్టీజియస్ ఫిల్మ్ ఫెస్టివల్ అయిన షాంగై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కి ఎంపికైంది. దీంతో మహానటి జర్నీలో మరో ఘనత యాడ్ అయ్యింది. 22వ షాంగై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జూన్ 15 నుంచి 24 వరకు చైనాలోని షాంగై నగరంలో జరగనుంది. మహానటి ఇప్పటికే 49వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఐఫా)లో పనోరమ సెక్షన్‌లో ప్రదర్శించబడి ప్రశంసలందుకుంది. దీంతోపాటు గతేడాది జరిగిన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ లో ప్రదర్శించబడి ఈక్వాలిటీ ఆఫ్ సినిమా పురస్కారం దక్కించుకుంది. తమిళ వెర్షన్ నార్వే తమిళ ఫిల్మ్ ఫెస్టివల్ కి సెలక్ట్ అయి ఉత్తమ నటిగా కీర్తి సురేష్ అవార్డునందుకుంది.
అలనాటి మేటి నటి సావిత్రి జీవితం ఆధారంగా గతేడాది మహానటి చిత్రాన్ని తెరకెక్కించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా, సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించి అద్భుత నటనతో విశేష ప్రశంసలందుకుంది. జెమినీ గణేషన్ పాత్రలో దుల్కర్ సల్మాన్, ఏఎన్నార్ గా నాగచైతన్య నటించి మెప్పించారు. వీరితోపాటు విజయ్ దేవరకొండ, సమంత, మాళవిక నాయర్, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్ వంటి వారు ఇతర కీలక పాత్రలతో అలరించారు. సుమారు 25 కోట్లతో వైజయంతి మూవీస్, స్వప్నసినిమా పతాకాలపై అశ్వినిదత్, స్వప్న దత్, ప్రియాంక దత్ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు, తమిళంలో సుమారు రూ.75 కోట్ల వరకు కలెక్ట్ చేసింది.