బెంగళూరు రేవ్ పార్టీలో సినీ నటి హేమ కూడా ఉన్నారంటూ బెంగళూరు సిటీ కమిషనర్ స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఈ విషయంపై స్పందించారు. ఆమెపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
‘‘సోషల్ మీడియా, కొన్ని మీడియా సంస్థలు, వ్యక్తులు హేమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయి. ఒక తల్లిగా, భార్యగా ఉన్న ఆమెపై లేని వదంతులు సృష్టించడం, వ్యక్తిగతంగా దూషించడం తగదు. నిర్ధారణ లేని, ధ్రువీకరించని సమాచారాన్ని ప్రచారం చేయడం మానుకోవాలి. హేమ దోషిగా రుజువయ్యే వరకు నిర్దోషిగానే పరిగణించాలి. అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చట్ట విరుద్ధమైన కార్యకలాపాలను ఖండిస్తుంది. హేమకు సంబంధించిన కచ్చితమైన ఆధారాలను పోలీసులు అందిస్తే ‘మా’ అసోసియేషన్ తగిన చర్యలు తీసుకుంటుంది. అప్పటివరకు హేమపై నిరాధారమైన ఆరోపణలను సంచలనాల కోసం ప్రసారం చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నా’ అని ఎక్స్‌లో మంచు విష్ణు పేర్కొన్నారు.