మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ (Amala Paul) నటించిన మూవీ ‘ఆడు జీవితం’ (ది గోట్‌లైఫ్). బెన్నీ డానియల్ (బెన్యామిన్) రాసిన ‘గోట్ డేస్’ నవల ఆధారంగా నిర్మించిన ఈ చిత్రానికి డైరెక్టర్ బ్లెస్సీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ సన్నివేశం ఇటీవల తీవ్ర చర్చకు దారి తీసింది. ‘గోట్ డేస్’లో రాసిన విధంగా ఓ వివాదాస్పద సన్నివేశాన్ని చిత్రబృందం షూట్ చేసిందని.. సెన్సార్ అంగీకరించకపోవడంతో దాన్ని తొలగించారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.
దీనిపై తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్ స్పందిస్తూ.. తాము అలాంటి సన్నివేశాన్ని చిత్రీకరించలేదని క్లారిటీ ఇచ్చారు. తన సినిమాలో హీరో పాత్ర అలా ప్రవర్తించకూడదని దర్శకుడు భావించాడని తెలిపారు. 2008లో బ్లెస్సీ ఈ కథతో తన వద్దకు వచ్చినప్పుడు.. ఆ పాత్రకు ఏవిధంగా న్యాయం చేయాలనే ఆలోచించానని, నవల ప్రకారం ఆ పాత్రను అర్థం చేసుకోవాలా? లేదా బ్లెస్సీ చెప్పిన విధంగా ఊహించుకోవాలా? అని తొలుత గందరగోళానికి గురయ్యానని చెప్పారు. చివరకు తానూ – బ్లెస్సీ ఒక నిర్ణయానికి వచ్చి.. ప్రేక్షకులకు చేరువయ్యేలా దానిని తీర్చిదిద్దామని వెల్లడించారు.