ప్రియా ప్రకాశ్ వారియర్.. ఓవర్ నైట్ స్టార్. కుర్రాళ్ల గుండెల్లో గునపాలు గుచ్చిన కేరళ బ్యూటీ. ప్రియా కన్ను కొట్టుడును తట్టుకోలేక కుర్రాళ్లు మతి పోగొట్టుకున్నారు. మొత్తానికి ప్రతి కుర్రాడి గుండెలో స్థానం సంపాదించుకున్న ఈ సుందరి.. మరో గొప్ప పని చేసి ఔరా అనిపించుకుంది.
ప్రస్తుత కేరళ పరిస్థితి గురించి అందరికీ తెలిసిందే. ప్రత్యేకంగా కేరళ గురించి ఇప్పుడు మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు. కేరళ వరద బాధితులకు వచ్చే విరాళాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రియా ప్రకాశ్ వారియర్ కూడా కేరళ వరద బాధితులకు తన వంతు సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నది. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఓ వీడియోతో పాటు తను కేరళ సీఎం సహాయ నిధికి పంపించిన లేఖను కూడా పోస్ట్ చేసింది. తన వంతు సాయంగా లక్ష రూపాయలను సీఎం సహాయ నిధికి పంపించగా.. సీఎంవో నుంచి ధన్యవాదాలు తెలుపుతూ పంపించిన లెటర్ అది.. ఈసందర్భంగా ప్రియ తన అభిమానులకు ఓ సందేశాన్ని పంపింది.
“ప్రస్తుతం కేరళ చాలా కష్టాల్లో ఉంది. ఈ ఓనం పండుగకు రాష్ట్రం కోసం నేను చేయగలిగింది చేస్తున్నా. చెప్పడం చాలా ఈజీ.. కానీ చేతల్లో చూపిస్తేనే దేనికైనా విలువ ఉంటుంది. నేను పబ్లిసిటీ కోసం ఇదంతా చేయట్లేదు. మేము ఎంత విరాళం ఇచ్చామో ప్రజలకు తెలిస్తే.. వాళ్లు కూడా మానుంచి ప్రేరణ పొంది ఎంతో కొంత సాయం చేస్తారనే చిన్ని ఆశ అంతే. దయచేసి వరద బాధితుల కోసం మీ వంతు సాయం చేయండి..” అంటూ వీడియోలో పేర్కొన్నది ప్రియ.