కాస్తయినా ముందూ వెనుకా చూడాలి అంటారు.నిర్ణయం వెనుక కారణం ఒకటి ఉంటుంది.నిర్ణయం ముందరి జీవితం ఒకటి సంతృప్త స్థితిలో ఉంటుందని అనుకోవడం ఓ సంభావ్యత. కొన్ని మాత్రమే అచ్ఛమయిన ప్రేమలు.. కొన్నే కలకాలం ఉండే సుదీర్ఘ కొనసాగింపులు.. కొన్ని తెగదెంపులు తరువాత, కొన్ని కలిపి ఉంచడంతో బాగుంటాయి అని అనుకోవడం ఓ వివక్ష. వివక్షా పూరిత ఆలోచన! భరించడం వివక్షకు కారణం. వదిలి పోవడం స్వేచ్ఛకు ఒక పర్యాయ పదం. స్వేచ్ఛను భర్తీ చేయడం సులువు..
బాధ్యతలను భర్తీ చేయడమే కష్టం. ఆ విధంగా సమంత బాధ్యతలను భర్తీ చేసే క్రమంలో ఉండాలని అనుకోవడం ఆమె అభిమానులకు మాత్రమే సాధ్యం అయ్యే పని!
లైఫ్ లీడ్స్ మెనీ థింగ్స్
సమ్ ఆర్ బెస్ట్
సమ్ హౌ బెస్ట్
బెస్ట్.. అన్నది తీపి.. బెస్టీ అన్నది ఇంకాస్త ఎక్కువ తీపి. అవునా! తీపి రోజులు ముందున్నాయి సమంతకు.. అందుకే ఇదంతా చేదు అని అనుకుంటుందని భావించాలి. తీపి అయినా, చేదు అయినా ఒక సందర్భంలో కొన్ని పరిచయాలు ఎదురుకాక తప్పవు. విడిపోవడంలో చేదు ఉంది.. కలిసి ఉండడంలోనూ కొన్నిసార్లు చేదు ఉంటుంది. దేన్నయినా భరించాకే వద్దనుకోవడం సులువు. ఆ విధంగా ఆమె జీవితంలో ఎదురయిన అనుభవాలు వేటిని వద్దనుకుంటున్నాయని? ప్రేమను మరియు పెళ్లిని వద్దనుకుని కొత్త జీవితం ఒకటి వెతుక్కోమంటున్నాయా?
అక్కినేని అనే నాల్గక్షరాలు తెలుగు సినిమా జీవితాలను ప్రభావితం చేశాయి. అక్కినేని మరియు అన్నపూర్ణ అన్న పదాలు మరికొన్ని విజయాలకు, వాటి కొనసాగింపులకు కారణం అయ్యాయి. అక్కినేని అనే పదం దగ్గర సమంత ఆగిపోయిందా? లేదా? అక్కినేని అనే ఓ పెద్ద గ్రంథం దగ్గర సమంత ఏమయినా నేర్చుకుందా ? లేదా? ఒకరి జీవితం నుంచి వెళ్లిపోవడంలో స్వేచ్ఛ ఉంటుంది.
ఒకరితో నడవడంలో బాధ్యత ఉంది. బాధ్యత అన్నది స్వేచ్ఛ కన్నా చాలా అంటే చాలా విలువైనది. బాధ్యత దగ్గర మనుషులు కొన్నింటిని భరించి పంటి బిగువున సహించి ఉండాలి. ఆ విధంగా ఉండేందుకు అక్కినేని కాంపౌండ్ ఒప్పుకుందో లేదో అన్నది సమంతే చెప్పాలి. బయట నుంచి చూసే ప్రేక్షకులకు వంద రంగులు కనిపిస్తాయి. సిసలు రంగు ఏంటన్నది సమంత చెప్పాలి.
లైఫ్ లో కొన్నే బెస్ట్ ఉంటాయి.. లైఫ్ లాంగ్ కొన్నే బెస్ట్ ఉంటాయి.లాంతరు వెలుగుల్లో జీవితాన్ని చూడడం ఓ చిన్న ఆనందం.. లాంతరు చుట్టూ పరుచుకున్న నీడల్లో ఒకటిగా ఒదిగిపోవడం మరో ఆనందం.. కాంతి ఒకటి కొన్ని సార్లే మనకు సంతృప్తికర ఆనందాలను ఇస్తుంది. కొన్ని సార్లు విషాదం అయిన జీవితాలను పరిచయం చేస్తుంది. కొన్ని కోట్ల రూపాయల సినిమా కెరియర్ అనేది వేల కాంతులకు సమానం. వేల కాంతుల సంకలనం.
ఎవరు ఎలా జీవించడం? ఎవరు ఎలాంటివి నేర్చుకోవడం? అన్నవి వారి వారి ఇష్టాలు. సమంత జీవితంలో ఇష్టమయినవి వదులుకోవాలని ఎందుకని భావిస్తుంది. ప్రేమ అన్నది ఇష్టపూర్వకంగా లేదు కనుక విడిపోతున్నారు. ప్రేమ ఇష్టపూర్వకంగా లేదని తెలుసుకున్నాక ఒకరికొకరు అన్న మాటకు అర్థమే లేదని భావిస్తున్నారు. ఇప్పుడంతా ఒక వెలివేతల కూడలిలో ఉన్నారు. మనుషులు ఆనందాలను తక్షణం పొందాలి. సుఖాల వెంట నడవాలి. వీటికి మించి మరో విశేషం ఏమయినా ఉందా? సమంత కూడా వాటి గురించే వెతుక్కోవాలి. విశేషం అన్నవి ఏవి? ప్రత్యేకం అన్నవి ఏవి? అని!
అన్నపూర్ణ స్టూడియో దారుల్లో ఎందరో ప్రతిభావంతుల జీవితాలకు చీకటి పరిచయం ఉంటుంది.వెలుగు అంది ఉంటుంది. వారందరి కన్నా కాస్త ఎక్కువ అదృష్టం సమంతది కావొచ్చు. అందుకే ఆ ఇంటికి కోడలుగా వెళ్లి ఉండవచ్చు. అదృష్టం అనే పదం దగ్గర కన్నా సమంత ప్రతిభతోనే ఎక్కువగా రాణించింది. అదృష్టం అనే పదం దగ్గర కన్నా తనని తాను నిరూపించుకునే ప్రయత్నాల్లో కొన్ని వేల మైళ్లు ఒంటరిగానే ప్రయాణించింది.ఇకపై ప్రయాణించాలి కూడా!
– రత్నకిశోర్ శంభుమహంతి