7/G బృందావన కాలనీ సినిమా ద్వారా 2004లో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న సోనియా అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో చేసింది కొన్ని సినిమాలు అయినా భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఈమె తన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. తర్వాత తెలుగులో అవకాశాలు రాకపోవడంతో తమిళ్, కన్నడ సినిమాలపై ఫోకస్ పెట్టి అక్కడ భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా సీక్వెల్ తీస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.
తమిళంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టార్ హీరో ధనుష్ అన్నయ్య అయిన స్టార్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ ను 2006లో వివాహం ఆడి ఆ తర్వాత 2010లో విడాకులు తీసుకుంది సోనియా. తర్వాత సెల్వ రాఘవన్ 2011లో మళ్ళీ పెళ్లి చేసుకున్నా.. సోనియా మాత్రం ఒంటరిగానే జీవిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఎన్నో విషయాలను వెల్లడించింది.. సోనియా అగర్వాల్ మాట్లాడుతూ.. ఒక దర్శకుడిగా సెల్వరాఘవన్ మొండి పట్టుదల కలిగిన వాడు.. అయితే వ్యక్తిగత జీవితంలో మాత్రం అలాంటి వ్యక్తి కాదు.
ఎప్పుడూ ప్రశాంతంగా, బిజీగా ఉంటారు.. రచన వగైరాలతో తనదైన లోకంలో ఉండేవాడు. కానీ నాతో వైవాహిక జీవితం గురించి ఇకపై మాట్లాడే ప్రసక్తే లేదు. మేము ఎందుకు విడిపోయామో .. అతనికి, నాకు మాత్రమే తెలుసు. ప్రస్తుతం ఆయన వెళ్తున్న దారిలో ఎంత సంతోషంగా ఉన్నారో ప్రస్తుతం నా దారిలో నేను కూడా అంతే సంతోషంగా ఉన్నాను అంటూ ఆమె తెలిపింది. జీవితంలో భార్యాభర్తలుగా కలిసి ఉన్న వాళ్ళు విడిపోయిన తర్వాత స్నేహితులుగా ఎలా ఉంటున్నారో మాత్రం నాకు అర్థం కావడం లేదు . నా వరకు అయితే అది సాధ్యం కాదు. అలాంటి పని నేను చేయలేను. ప్రేమ చనిపోయిన తర్వాత స్నేహితుడిలా చూడలేను. ఇక అలాంటి వ్యక్తి నా జీవితంలో ఎప్పుడూ ఇక లేనట్లే అంటూ చెప్పుకొచ్చింది సోనియా.