సోనూసూద్ అంటే తెలియని తెలుగు సినిమా ప్రేమికులు లేరు. విలన్ పాత్రలో పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా అనుష్క అరుంధతిలో సినిమాలో `వదల బొమ్మాళి వదలా` అంటూ పశుపతిగా విలన్ పాత్రలో సోనూసూద్ అభినయం చూపరులను మెస్మరైజ్ చేసింది. అలాగే విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బాలీవుడ్, టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు ఈయన. అయితే రీల్ లైఫ్‌లో విలన్‌గా నటించినా.. రియల్ లైఫ్‌లో మాత్రం హీరో అనిపించుకున్నాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా డాక్టర్లు, నర్సులు, పోలీసులు, మీడియా,పారిశుద్ధ కార్మికులు, జల మండలి, విద్యుత్ వంటి అత్యవసర సేవలు మాత్రం నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సోనూసూద్ కరోనా వైరస్ పై పోరాటంలో విశేష కృషి చేస్తున్న వైద్య సిబ్బందికి సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. ఇందులో భాగంగా వైద్య సిబ్బంది ఉండడానికి ముంబైలోని తన హోటల్‌ను ఇస్తున్నట్టు ప్రకటించాడు.
ఈ మేరకు.. ‘ప్రజల ప్రాణాలను కాపాడేందుకు రోజంతా శ్రమిస్తున్న వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందికి చిన్న సాయం చేసే అవకాశాన్ని గౌరవంగా భావిస్తున్నా. వాళ్లంతా ముంబైలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి సేవ చేస్తున్నారు. వాళ్లు విశ్రాంతి తీసుకునేందుకు ఒక చోటు కావాలి. అందుకు మా హోటల్‌ను వినియోగించుకోవాలని మున్సిపల్, ప్రైవేట్ ఆసుపత్రులకు తెలిపాము’ అని సోనూసూద్ వెల్లడించాడు.