సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే స్పెషల్ …!

-

ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి …తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టాక కృష్ణగా మారారు. హీరోగా 345 సినిమాలు చేసిన కృష్ణ డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా సూపర్ స్టార్ గా పాపులారిటీని సాధించి అంచలంచెలుగా శిఖరం అంత ఎత్తుకు ఎదిగారు. ఎన్ టి ఆర్ .. ఏ ఎన్ ఆర్ కాలం నుండి చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకొని ధైర్యానికి సాహసానికి మారుపేరుగా నిలిచారు.

 

సినిమాల పరంగా కృష్ణ చేసిన ప్రయోగాలు మరే హీరో చేయలేదనే చెప్పాలి. ఒక సినిమా కమిటయ్యారంటే ఆ సినిమా పూర్తయ్యో వరకు పూర్తి సహకారం అందించడంలో కృష్ణ తర్వాతే ఎవరైనా. కొత్త తరహా కథలు చేయాలన్నా..కొత్త దర్శకులకు అవకాశాలివ్వాలన్న కొత్త అమ్మాయిని హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేయాలన్నా కృష్ణ తీసుకునే నిర్ణయం అని చెప్పాలి. తెలుగు చిత్ర పరిశ్రమలో విజయశాంతి లేడీ సూపర్ స్టార్ గా పాపులారిటీని సంపాదించుకున్నారంటే అది కృష్ణ గారి చలువే అని చెప్పాలి. కృష్ణ పరిచయం చేసిన విజయశాంతి రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరి తో 13 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇవ్వడం పెద్ద సంచలనం.

 

1964-65 లో కృష్ణ హీరోగా నటించిన మొదటి సినిమా తేనెమనసులు. ఈ సినిమా తర్వాత నటించిన గూఢచారి 116 తో ఇక సినిమా ఇండస్ట్రీలో వెనుతిరిగి చూసుకోలేదు. దాదాపు నలభై సంవత్సరాలు హీరోగా సుధీర్ఘమైన ప్రయాణం చేసిన కృష్ణ 345 సినిమాలు హీరోగా చేశారు. కొన్ని చిత్రాలో గెస్ట్ అపీరియన్స్ ఇచ్చారు. 1970లో సొంతగా పద్మాలయా పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. అంతేకాదు 16 సినిమాలకి దర్శకత్వం వహించారు.

 

కృష్ణ ప్రయోగాలకి కేరాఫ్ అడ్రస్ అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ సినిమా (గూఢచారి 116), తొలి కౌబాయ్ సినిమా (మోసగాళ్ళకు మోసగాడు), తొలి ఫుల్‌స్కోప్ సినిమా (అల్లూరి సీతారామరాజు), తొలి 70 ఎంఎం సినిమా (సింహాసనం) వంటివి కృష్ణ నటిస్తూ ప్రయోగాలు చేసిన సినిమాలు. ఇక వరసగా పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, పాడిపంటలు, ఈనాడు, అగ్నిపర్వతం వంటి సూపర్ హిట్ సినిమాలతోను నాన్ స్టాప్ హిట్స్ అందుకొని నంబర్ వన్ గా నిలబడ్డారు.

 

ముఖ్యంగా 1976-1985 మధ్యకాలంలో కృష్ణ సినిమా కెరీర్ చాలా అద్భుతంగా సాగింది. 1964 నుంచి 1995 వరకు కృష్ణ సంవత్సరానికి 10 సినిమాల చొప్పున పదేళ్ళలో 100 సినిమాలు చేసి తిరుగు లేని హీరోగా పేరు సంపాదించుకున్నారు. చెప్పాలంటే ఈ విధంగా మరే హీరో చేయలేదు. ఇక రోజులో మూడు షిఫ్టులు పని చేసి ఒక రోజులో మూడు సినిమాలలో నటించారు. ఇదీ ఒక రికార్డ్ అని చెప్పాలి.

 

ఇక కృష్ణ ఫిల్మ్‌ఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం, ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. తన తర్వాత తన వారసులను చిత్ర పరిశ్రమకి పరిచయం చేశారు. మహేష్ బాబు, రమేష్ బాబు, కుమార్తె మంజుల, చిన్న అల్లుడు సుధీర్ బాబు సినిమా రంగంలో విజయవంతంగా కొనసాగుతున్నారు. ముఖ్యంగా మహేష్ బాబు, రమేష్ బాబు, కుమార్తె మంజుల ..నటులుగా నిర్మాతలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో పాపులారిటీని సంపాదించుకున్నారు.

 

ఇక మహేష్ బాబు తండ్రి కి తగ్గ తనయుడిగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతమైన స్టార్ ఇమేజ్ ని సాధించుకున్నాడు. తండ్రి మాదిరిగానే జి ఎం బి ఎంటర్‌టైన్‌మెంట్స్ అనే నిర్మాణ సంస్థ ద్వారా సినిమాలను నిర్మిస్తున్నారు. ఇక మహేష్ బాబు సినిమాల విషయంలో తీసుకునే కొన్ని నిర్ణయాలు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నే గుర్తు చేస్తాయి. అందుకు ఉదాహరణ గా మురారి, నాని, పోకిరి, బిజినెస్ మాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీమంతుడు ..వంటి సినిమాలు చెప్పొచ్చు.

 

ఇక ప్రతీ సంవత్సరం మహేష్ బాబు తన తండ్రి పుట్టినరోజు అయిన మే 31 ని పురస్కరించుకొని తన కొత్త సినిమా సంగతులను ఫ్యాన్స్ కి గిఫ్ట్ గా ఇస్తుంటారు. ప్రతీ సంవత్సరం ఈ రోజున మహేష్ నటిస్తున్న సినిమాకి సంబంధించి ఏదో ఒక న్యూస్ వచ్చి ప్రేక్షకులను సంబరాల్లో ముంచేస్తుంది. ఎప్పటిలాగే ఈ రోజు కూడా మహేష్ బాబు నటించే తన 27 వ సినిమా సర్కారు వారి పాట అన్న సినిమాని లాంచ్ చేశారు. గీత గోవిందం ఫేం పరశురాం దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుండగా మహేష్ సొంత నిర్మాణ సంస్థ జి ఎం బి ఎంటర్‌టైన్‌మెంట్స్ తో కలిసి 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ .. మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ మూడు నిర్మాణ సంస్థలు కలిసి సూపర్ స్టార్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ మహేష్ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ తో ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version