నేరగాళ్ల నయా మోసం.. సమాజ సేవ ముసుగులో భాగోతం.. !

-

ఒక వైపు ప్రజలంతా కరోనాతో పోరాడుతుంటే.. మరోవైపు మోసగాళ్లు వారిపని వారు చేసుకుంటూ అందినకాడికి దోచుకుంటున్నారు.. అమాయకుల ఆశను అవకాశంగా మలచుకుని, నమ్మించి, మాయమాటలు చెప్పి ఎలాగోలా వారిని బురిడి కొట్టిస్తున్నారు.. ఇలా నిత్యం ఎన్నో దారుణాలు వెలుగు చూస్తున్నా సమాజంలో మార్పు లేదు.. అందుకే మోసపోయేవారు ఉన్నంత కాలం మోసం చేసేవారు పుట్టుకొస్తారనేది నిజం..

 

ఇకపోతే ప్రస్తుత పరిస్దితుల్లో పేదల బ్రతుకులు గాల్లో దీపాలుగా మారాయి.. ఇలాంటి సమయంలో నలుగురికి సహాయం చేసే వారే కరువైయ్యారు.. ఒకవేళ మంచితనంతో సమాజ సేవ చేయడానికి ముందుకు వచ్చినవారు కొందరి కుతంత్రాలకు బలి అవుతున్నారు.. ఇలాంటి పరిస్దితుల్లో సాటి మనిషిని నమ్మాలంటేనే భయం కలిగేలా ప్రవర్తిస్తున్నారు.. ఇదిగో ఇప్పుడు అలాంటి మోసమే చేస్తున్న ముగ్గురిని సుల్తాన్‌బజార్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.. ఆ వివరాలు తెలుసుకుంటే..

 

ఆర్య మహిళా సంఘం నాయకురాలిగా సేవా కార్యక్రమాలు చేపడుతున్న బడీచౌడీకి చెందిన శీలం సరస్వతి అనే మహిళకు గత నెలలో నిజామాబాద్‌ జిల్లా ఎడుపల్లి మండలం అంబం గ్రామానికి చెందిన పవన్‌ (28) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.. కాగా ఆ మోసగాడు తాను తెలంగాణ సోషల్ సర్వీస్‌లో చేస్తున్నానని ఈ మహిళను మభ్యపెట్టి మీలా సమాజ సేవ చేసే వారు మా సంస్థలో సభ్యత్వం తీసుకుని, మీరు చేపట్టే సేవా కార్యక్రమాలను కంపెనీ గ్రూపులో పోస్ట్‌ చేస్తుండాలి.. ఇలా చేయడం వల్ల మీకు నెల నెలా సాలరీలా బ్యాంక్‌ ఖాతాలో జమచేయడం జరుగుతుందని నమ్మించి సభ్యత్వం కట్టించాడు..

 

అలా శీలం సరస్వతికి తెలిసిన పలువురు మహిళల నుండి కూడా సభ్యత్వ రుసుం పేరిట రూ. 2 వేల నుంచి రూ. 6 వేల వరకు తన స్నేహితులైన లక్ష్మణ్‌ (36), ప్రసాద్‌ (30) బ్యాంక్‌ ఖాతాలకు గూగుల్‌ పే ద్వారా జమ చేయించుకున్నాడు. ఇలా సుమారు 120 మంది వరకు డబ్బులు చెల్లించి సభ్యత్వం తీసుకున్నారు. ఈ క్రమంలో ఆ గ్రూపులో కొన్ని రోజుల వరకు సేవా కార్యక్రమాలను పోస్ట్‌ చేయించాడు. అయితే అప్పటికే నెల గడిచినా ఈ మహిళల ఖాతాలలో వేతనం పడకపోవడంతో సభ్యత్వం తీసుకున్న వారు శీలం సరస్వతి పై ఒత్తిడి చేయడం ప్రారంభించారు.

 

దీంతో ఆమె పవన్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించాగా, అతను స్పందించకపోగా వీరి వాట్సాప్‌ గ్రూప్‌లో అసభ్య చిత్రాల పోస్టులు పెట్టడం మొదలు పెట్టాడట.. అప్పటికి గానీ తాము మోసపోయామని గ్రహించిన ఈ మహిళలంతా ఈ నెల 26న పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను వారి గ్రామంలో శనివారం అరెస్ట్‌ చేసి నగరానికి తీసుకువచ్చి రిమాండ్‌ చేశారు. ఇకపోతే ఇందులోని ప్రధాన నిందితుడిగా ఉన్న పవన్‌ గతంలో కూడా ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు తెలిసింది..

Read more RELATED
Recommended to you

Exit mobile version