ప్రయోగాలు చేయడం కొత్తేం కాదు. కెరీర్ మొదటినుంచి అటు కమర్షియల్ ఇటు ప్రయోగాత్మక చిత్రాలతో భిన్నమైన పాత్రలు చేస్తూ మాస్, క్లాస్ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారాయన. ‘శివపుత్రుడి’లో మిత్రుడిగా.. ‘గజిని’లో గతం మర్చిపోయే వ్యక్తిగా.. ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’తో తండ్రి కొడుకులుగా.. ‘సింగం’తో యూనిఫామ్‌లో ఉన్న సింహంలా.. ‘సెవెన్త్ సెన్స్’లో మనకు తెలియని చారిత్రక హీరోగా.. ’24’ సినిమాతో కాలాన్ని తారుమారు చేసే మాయగాడిలా.. ‘ఆకాశమే హద్దురా’తో లక్ష్యం కోసం శ్రమించే ఓ యోధుడిలా.. ‘జైభీమ్’తో న్యాయం కోసం పోరాడే న్యాయవాదిలా.. ఇలా అన్నిరకాల వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ.. తనకంటూ ఓ ప్రత్యేకమైన హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు హీరో సూర్య. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలతో పాటు ఆయన పోషించిన పాత్రలను నెమరువేసుకుందాం…
సినిమాల్లోకి రాకముందు సూర్య ఓ వస్త్రాల ఎగుమతి కర్మాగారంలో కొన్ని నెలల పాటు పనిచేశారు. తమిళ నటుడు శివకుమార్ కుమారుడిగా కాకుండా.. తనకంటూ ఓ గుర్తింపు రావాలని సూర్య భావించారు. ఆ సమయంలో అతడు తన ఐడెండిటీని బయటకు చెప్పకుండా సామాన్యుడిగా పనిచేశారు. సూర్య 1997లో తొలిసారిగా ‘నెరుక్కు నేర్’ అనే సినిమాతో వెండితెర అరంగేట్రం చేశారు. అయితే అంతకంటే ముందు ఆయన.. ప్రముఖ దర్శకుడు వసంత్ తెరకెక్కించిన ఆశాయ్తో(1995) సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. కానీ అప్పటికీ సూర్య యాక్టింగ్‌పై ఆసక్తి లేకపోవడం వల్ల అజిత్ ఆ చిత్రంలో నటించి సూపర్‌హిట్‌ను అందుకున్నారు.
‘అగరమ్ ఫౌండేషన్’ ఏర్పాటు చేసి ఆ సామాజిక సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు సూర్య. చదువుకోలేని పేద పిల్లలకు ఈ సంస్థ ద్వారా ఉచితంగా చదువు చెప్పిస్తున్నారు. తండ్రి శివకుమార్ పేరు మీద ‘శివకుమార్ చారిటబుల్ ట్రస్ట్’ ఏర్పాటు చేసి శ్రీలంకలోని తమిళులకు సాయం చేస్తున్నారు. అంతేకాకుండా పలు సామాజిక ప్రచార కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ గొప్ప మనసును చాటుకుంటున్నారు.
సూర్య కెరీర్లో ఈ పాత్రలు వేరీ స్పెషల్
- గౌతమ్ మీనన్ దర్శకత్వంలోని కాకా కాకా (తెలుగులో ఘర్షణ) చిత్రంతో సూర్య స్టార్ హీరో అయ్యారు. అనంతరం శివపుత్రుడు, సుందరాంగుడులో విభిన్న పాత్రలతో మెప్పించారు.
- ‘సుందరాంగుడు’లో గూని ఉన్న వ్యక్తి పాత్రలో నట విశ్వరూపం చూపించారు. తర్వాత ‘గజిని’లో ఆ యాక్టింగ్ శిఖరాన్ని తాకింది. 15 నిమిషాల్లో అన్నీ మర్చిపోయే మానసిక రోగిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంతో తెలుగులోనూ స్టార్ అయ్యారు సూర్య.
- గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ రెండు పాత్రల్లో నటించి ఉత్తమనటుడిగా ఫిల్మ్‌ఫేర్ అందుకున్నారు
- ‘సెవెన్త్ సెన్స్’లో బౌద్ధ గురువుగా కనిపించి.. చారిత్ర హీరోగా మార్కులు కొట్టేశారు.
- ‘బ్రదర్స్’లో కవలలుగా మాస్, క్లాస్ పాత్రలతో కనిపించి తన నటనతో ఫిదా చేసేశారు.
- ’24’లో ఏకంగా హీరో, విలన్ పాత్ర తానే పోషించి తనలోని కొత్త కోణాన్ని చూపించారు.
ఇక తాజాగా వచ్చిన ‘విక్రమ్’లో చివరి మూడు నిమిషాల్లో క్రూరమైన విలన్‌గా కనిపించి సినిమాకే హైలైట్‌గా నిలిచారు. ప్రస్తుతం ఆయన దాదాపు 18ఏళ్ల తర్వాత మళ్లీ బాల దర్శకత్వంలో నటిస్తున్నారు.