సినీ నటుడు నందమూరి తారకరత్న గుండెపోటుతో గత ఆరు రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తారకరత్న ఆరోగ్యం రోజురోజుకి మెరుగుపడుతోందని వైద్యులు తెలిపారు. తారక్ గుండె, కాలేయం ఇతర అవయవాలన్నీ బాగున్నాయని.. మెదడుకు సంబంధించి చికిత్స జరుగుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తారకరత్న మెదడుకు సంబంధించి చికిత్సను వైద్యులు ప్రారంభించారు. తారకరత్న అనారోగ్యానికి గురైన రోజు నుంచి నందమూరి బాలకృష్ణ దగ్గరుండి తారకరత్న బాగోగులను చూసుకుంటూ.. ఎప్పటికప్పుడు వైద్యులతో చర్చలు జరుపుతున్నారు.
బాలకృష్ణ గురువారం హైదరాబాద్ నుంచి నారాయణ హృదయాలయ ఆసుపత్రికి చేరుకున్నారు. అనంతరం తారకరత్న ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో సంప్రదింపులు జరిపారు. తారకరత్న ఆరోగ్యం మెరుగుపడేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని డాక్టర్లు తెలిపారు. నందమూరి తారకరత్నకు ఇక్కడి వైద్యులు వెంటిలేటర్ సాయంతో అత్యున్నత వైద్య సేవలను అందిస్తూ వస్తున్నారు. తారకరత్న ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు బులిటెన్ విడుదల చేస్తూ.. ఆయన అభిమానులకు ఆరోగ్య పరిస్థితిని వెల్లడిస్తున్నారు.