ప్రముఖ దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత శ్యామ్ బెనగల్ (90) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా వృద్ధాప్య సమస్యలకు తోడు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కాసేపటి క్రితమే తుది శ్వాస విడిచారు. ముంబైలోని ఓ ఆసుపత్రిలో ఆయన కన్నుమూశారని కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. 1934 డిసెంబర్ 14న హైదరాబాద్ లోని తిరుమలగిరిలో శ్యామ్ బెనగల్ జన్మించారు.
సికింద్రాబాద్ ప్రభుత్వ కళాశాలలో శ్యామ్ బెనగల్ డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ ఎకనామిక్స్ పట్టా పొందారు. సామాజిక సమస్యలు, ఆర్థిక అసమానతులపై ఆయన సినిమాలు రూపొందించేవారు. ఆయన రూపొందించిన సినిమాలకు 18 జాతీయ అవార్డులు దక్కాయి. బాలీవుడ్ లో ఆయన అంకుర్, భూమిక, నిశాంత్, కలియుగ్, మంథన్ సహా ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. పద్మశ్రీ, పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే, ఏఎన్ఆర్ జాతీయ అవార్డులను శ్యామ్ బెనగల్ అందుకున్నారు. శ్యామ్ బెనగల్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు.