నటీనటులు: విజయ్, నయనతార
మ్యూజిక్: ఏఆర్.రెహ్మన్
సినిమాటోగ్రఫీ: జికె.విష్ణు
నిర్మాత: మహేష్ కోనేరు
దర్శకత్వం: అట్లీ
రిలీజ్ డేట్: 25 అక్టోబర్, 2019
సెన్సార్ రిపోర్ట్: యూ / ఏ
రన్ టైం: 178 నిమిషాలు
కోలీవుడ్ క్రేజీ హీరో ఇళయ దళపతి విజయ్ హీరోగా నయనతార హీరోయిన్ గా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బిగిల్. తెలుగులో విజిల్ పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ కాంబోలో ఇప్పటికే తెరీ (పోలీసోడు), మెర్సల్ (అదిరింది) సినిమాలు రావడంతో ఈ ఇద్దరి కాంబినేషన్ అంటే ఒక మ్యాజిక్ ఉంది.మరి ఆ మ్యాజిక్ ఈ చిత్రంతో మళ్ళీ రిపీట్ అయ్యిందా లేదా అన్నది సమీక్షలో చూద్దాం.
కథ:
మైఖేల్(విజయ్) ఒక ఫుట్ బాల్ ప్లేయర్. ఊహించని కారణాలతో తాను అనుకున్న లక్ష్యానికి దూరమవుతాడు. చాలా గ్యాప్ తర్వాత ఓ మహిళా ఫుట్‌బాల్ టీం కోచ్‌గా వెళతాడు. ఈ క్రమంలోనే విజయ్ మహిళా ఫుట్‌బాల్ టీం కోచ్‌గా ఏం చేశాడు ? ఈ సినిమాలో బిగిల్, విజయ్, మైఖేల్ పాత్రలకు ఉన్న లింక్ ఏంటి ? అసలు ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాలో ఉన్న మలుపులు ఏంటన్నది చూడాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ :
విజయ్ – అట్లీ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుడు మాస్, ఎమోషనల్ సీన్లు ఎక్కువుగా ఆశిస్తాడు. ఇక విజిల్‌లో ఫస్టాఫ్ విషయానికి వస్తే పాత్రలు పరిచయం చేసేందుకే దర్శకుడు ఎక్కువుగా టైం వేస్ట్ చేసేశాడు. మాస్ ఎలివేషన్ సీన్లపై కాన్‌సంట్రేషన్ చేసి మెయిన్ కథలోకి వెళ్లేందుకు చాలా టైం తీసుకుంటాడు. సినిమాకు
బలమైన కథ లేనట్టు అనిపించింది.కానీ మాస్ ఎలివేషన్ సీన్స్ మాత్రం ఆకట్టుకుంటాయి.
సినిమా రన్ టైం ఎక్కువ కావడంతో సాగదీత సన్నివేశాలు ఎక్కువుగా ఉన్నాయి. అట్లీ ఇంకా టైట్ స్క్రీన్ ప్లే రాసుకుంటే ఉంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ లోని ప్రీ ఇంటర్వెల్ లో ట్విస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ మెయిన్ హైలెట్స్. పోలీసోడు, అదిరింది తరహాలో ఈ సినిమాలో కూడా ఎమోషనల్ సీన్లు ఉన్నా ఆ రెండు సినిమాలను మించిన రేంజ్‌లో లేకపోవడంతో కొత్తగా అనిపించవు.
ఇక ఫస్టాఫ్‌ను సోసోగా నడిపించిన అట్లీ కీలకమైన సెకండాఫ్‌లో మాత్రం ఆసక్తికరంగా మలిచాడు. లేడీస్ ఫుట్‌బాల్ కోచ్‌గా విజయ్ వచ్చిన తర్వాత సినిమా స్పీడ్ అవుతుంది. అటు ఎమోషన్‌తో పాటు ఇటు కామెడీ మెయింటైన్ అవుతుంటాయి. సెకండాఫ్‌లోనే అసలు కథ ప్రారంభమవుతుంది. ఫుట్‌బాల్ మ్యాచ్‌లు స్టార్ట్ అయిన తర్వాత అట్లీ ప్రేక్షకులను ఒక్కసారిగా కథలో లీనం చేస్తాడు. మహిళలు పడుతున్న ఇబ్బందులు, వారు వాటిని అధిగమించి ఎదిగే తీరు చూపించడం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది.
లేడీ ఫుట్ బాల్ ప్లేయర్స్ అందరికి ఒక్కో ఫ్లాష్ బ్యాక్ ఉంది.వాటిని అధిగమించి ఆత్మస్థైర్యం నింపుకొని ఓ కీలక మ్యాచ్ కోసం సన్నద్ధం చేయడం అద్భుతంగా ఉంది.
నటీనటుల్లో విజయ్ మరోసారి విశ్వరూపం చూపించాడు. అటు రఫ్ అండ్ టఫ్‌గాను ఇటు మిడిల్ ఏజ్డ్ నటుడిగాను, ఫుట్‌బాల్ కోచ్‌గాను ఒకదానితో ఒకటి సబంధం లేని పాత్రల్లో మెప్పించాడు. కీలకమైన ఎమోషనల్ సీన్స్ మరియు యాక్షన్ సీన్స్ లో పలికించిన హావభావాలు చాలా బాగున్నాయి. ఇక నయనతార నటన ఓకే. ఇక నెగిటివ్ రోల్ లో కనిపించిన టైగర్ ష్రాఫ్ మంచి నటన కనబరిచారు.
టెక్నికల్‌గా ఏఆర్.రెహ్మన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా రేంజ్ పెంచింది.
ఇక విష్ణు సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. ఎడిటింగ్ మాత్రం ఫస్టాఫ్ సరిగా కుదర్లేదు. చాలా సీన్లు ట్రిమ్ చేసేయొచ్చు. ఇక తెలుగు డబ్బింగ్ నిర్మాణ విలువలు ఓకే. దర్శకుడు అట్లీ విషయానికి వస్తే ఎక్కడా రొటీన్ కథే తీసుకున్నా విజయ్ అభిమానులకు సగటు ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా తీశారు. అందుకోసం చాలా సాగదీత సీన్లు, గతంలో చాలా సినిమాల్లో చూసిన సీన్లు ఇరికించేశాడు.
అటు ఫస్టాఫ్‌లో చాలా అనవసరమైన సీన్లు కూడా ఉన్నాయి. సెకండాఫ్‌లో చూపిన శ్రద్ధ అట్లీ ఫస్ట్ హాఫ్ లోనే తీసుకొని ఉంటే ఒక రెండున్నర గంటల్లో సినిమా క్రిస్పీగా వచ్చి ఉండేది. సినిమా రన్ టైం పెద్ద మైనస్‌గా మారడంతో పాటు కొన్ని చోట్ల ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించింది.
ఫైనల్‌గా…
విజయ్ – అట్లీ కాంబోలో మెసేజ్, స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన విజిల్ సెకండాఫ్‌లో బలమైన ఎమోషనల్ సీన్స్ మరియు మాస్ ఎలివేషన్ సీన్స్ తో ఆకట్టుకుంటుంది. కథ రొటీనే అయినా సినిమాలో ఉన్న మస్ ఎలివేషన్స్, ఎమోషనల్ సీన్లు మాత్రం అందరిని ఆకట్టుకుంటాయి. మరి బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షంలో విజిల్ మోగుతుందా ? లేదా ? అన్నది చూడాలి.
విజిల్ రేటింగ్: 2.75 / 5