తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మో్త్సవాలలో అయిదోరోజు ఉదయం స్వామి మోహిని అవతారంలో దర్శనమిచ్చారు. రాత్రి గరుడవాహనంలో దర్శనమిచ్చారు.
బ్రహ్మోత్సవాలలో నడిమిదైన అయిదోరోజున, స్వామివారు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ అవతార వూరేగింపు విధానానికి ఓ ప్రత్యేకత ఉంది. మిగిలిన అన్ని వాహనసేవలూ స్వామివారి ఆలయంలోని వాహన మండపంలో ఆరంభమైతే, మోహినీ అవతార వూరేగింపు శ్రీవారి ఆలయంనుంచే పల్లకీపై ఆరంభమవుతుంది. మోహినీ అవతారంలో ఉన్న స్వామి వజ్రాలు, రత్నాలు పొదిగిన హారాన్ని ధరించి, తన కుడిచేతితో చిలుకను పట్టుకొని ఉంటారు. ఈ హారాన్నీ, చిలుకనూ స్వామివారి భక్తురాలైన శ్రీవిల్లి పుత్తూరు ఆండాళ్(గోదాదేవి) నుంచి తెచ్చినట్లుగా చెప్తారు.
గరుడవాహనం
ఐదో రోజు రాత్రి గరుడవాహనంలో శ్రీ మలయప్పస్వామి తన దివ్యమంగళ రూపాన్ని భక్తులు దర్శించారు. దాస్య భక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడినవుతానని గరుడవాహనం ద్వారా స్వామి సేవ అంతరార్థం. మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తకోటికి తెలియజెప్పడమే ఈ వాహనసేవ ఉద్దేశం.
– శ్రీ