సర్వసాధారణంగా పూజలు, వ్రతాలు చేస్తున్నప్పుడు అయ్యగారు ఆచమనం చేయండి అంటారు. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే మూడుసార్లు నీళ్లు తాగండి. నాల్గోసారి చేతిని నీటితో కడుక్కోండి అంటుంటారు. అసలు ఎందుకు అలా చేస్తారు. అప్పుడు ఏ నామాలు చదువుతారు తెలుసుకుందాం…
ఆచమనం అంటే సర్వలోకలాకు అధిపతి అయి సర్వత్రా వ్యాపించిన విష్ణుమూర్తి పవిత్రనామాల ఉచ్చరణే ఆచమనం.
ఎలా చేయాలి.. ?
చిన్న రాగి గ్లాసు, చిన్న రాగి ప్లేటు, చిన్న రాగి చెంచా (ఉర్ధరిణి) ఈ సెట్‌ను పంచపాత్ర అంటుంటారు. దీనిలో పవిత్రమైన అంటే అప్పుడే బావులు, బోర్లు లేదా మంచినీటి పంపుల్లో పట్టుకవచ్చిన నీరు తీసుకోవాలి. ఈ నీటిని ఉర్ధరిణితో (ఎడమచేతితో) కుడిచేతిలో పోసుకోవాలి. దీనికోసం కుడిచేతిలో బొటనవేలు, చూపుడు వేలు మూసివేయాలి. అప్పుడు మిగిలిన మూడు వేళ్లుచాప ఉంటాయి. ఆ విధంగా చేతిని పెట్టినప్పుడు ఏర్పడే చిన్న ప్రదేశంలోకి గురువింద గింజ అంత నీటిని మొదటిసారి కేశవయస్వాహా అని, రెండోసారి నారాయణాయస్వాహా అని, మూడోసారి మాధవాయస్వాహా అని తీసుకోవాలి. నీటిని నోటిలోకి తీసుకునే సమయంలో చప్పుడు రాకుండా తీసుకోవాలి. తర్వాత నాల్గోసారి గోవిందాయనమః అని చేతిని ఒకచుక్కు నీటితో కడుగుకోవాలి. తర్వాత కిందినామాలను అయ్యగారు చదువుతారు. మీరు నేర్చుకుని చదువుకోవచ్చు. అవి…
కేశవ, నారయణ, మాధవ, గోవిందా! విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషీకేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, పురుషోత్తమ, అధోక్షజ, నారసింహ, అచ్యుత, జనార్దన, ఉపేంద్ర, హరి, శ్రీకృష్ణయనమః అని చదువుకోవాలి. తర్వాత ప్రాణాయామం చేసి తర్వాత సంకల్పం తర్వాత పూజ ప్రారంభం అవుతుంది.
ఒక్కో నామానికి ఒక్కో విశేషం ఉంది. వాటి అర్థం, పరమార్థం తర్వాత రోజుల్లో తెలుసుకుందాం. సింపుల్‌గా మూడునామాలు చదివినప్పుడు తమో,రజో,సత్వగుణాలను వదిలి శుద్ధంగా మారడం దీని ముఖ్య ఉద్దేశం, అంతే కాకుండా త్రికరణాలను అంటే మనస్సు, వాక్కు, కర్మలను శుద్ధంగా భగవంతుడికే అర్పిస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నాను అర్థమని కొందరు పండితుల అభిప్రాయం.
– కేశవ