భారతదేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉజ్జయినిలోని మహాకాళేశ్వరాలయం గురించి వినగానే మనసు పులకించిపోతుంది. ఈ క్షేత్రానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి మహాకాలుడు లోకాలను శాసించే కాలానికి అధిపతిగా వెలిశాడు. ఈ పవిత్ర భూమి నుంచే శివుడు సమస్త లోకాలను రక్షిస్తున్నాడనే పురాణ కథ ఈ క్షేత్రానికి ఆధ్యాత్మిక వైభవాన్ని చేకూర్చింది. ఆ కథ ఏమిటో తెలుసుకుందామా..
లోక రక్షణ కోసం మహాకాలుడి ఆవిర్భావం: పురాణాల ప్రకారం, పూర్వం అవంతి (ఉజ్జయిని పాత పేరు) నగరంలో వేదప్రియుడు అనే శివభక్తుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి నలుగురు కుమారులు ఉండేవారు. అదే సమయంలో, దూషణాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ వరం పొంది లోకాలన్నింటినీ పీడించడం మొదలుపెట్టాడు. దేవాలయాలను, యజ్ఞాలను ధ్వంసం చేస్తూ, ధర్మాన్ని నాశనం చేశాడు. అయితే అవంతి నగరంలో మాత్రం ఆ బ్రాహ్మణుడు, అతని కుమారులు శివుడి యొక్క పార్థివ లింగానికి పూజ చేస్తూనే ఉన్నారు.

జ్యోతిర్లింగంగా వెలసిన పరమేశ్వరుడు: శివుడికి పూజ చేస్తున్న ఆ బ్రాహ్మణులను సంహరించడానికి దూషణాసురుడు అవంతి చేరుకుంటాడు. ఆ సమయంలో భక్తుల రక్షణ కోసం, శివుడు ఆ పార్థివ లింగం నుంచి భయంకరమైన మహాకాళుడి రూపంలో ప్రకాశిస్తూ ప్రత్యక్షమయ్యాడు. ఒక్క హుంకారంతో దూషణాసురుడిని మరియు అతని సైన్యాన్ని భస్మం చేసి, లోకాలను కాపాడాడు. తమను కాపాడిన శివుడిని చూసి ఆ బ్రాహ్మణులు అపమృత్యు భయాన్ని తొలగించి, కలియుగాంతం వరకు ఇక్కడే జ్యోతిర్లింగంగా వెలసి భక్తులకు ఆశీస్సులు అందించమని కోరారు. వారి కోరిక మేరకు శివుడు ఇక్కడ మహాకాళేశ్వరుడిగా స్థిరపడ్డాడు. ఉజ్జయిని మహాకాళేశ్వరుడిని దక్షిణ ముఖి జ్యోతిర్లింగం అని కూడా అంటారు.
ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడు కేవలం కాలానికి అధిపతి మాత్రమే కాదు తన భక్తుల కోసం, ధర్మాన్ని కాపాడడం కోసం పార్థివ లింగం నుంచి ఆవిర్భవించిన లోక రక్షకుడు. అందుకే ఈ క్షేత్రంలోని మహాకాళుడి దర్శనం మృత్యు భయాన్ని తొలగిస్తుందని, భక్తులు సకల పాపాల నుండి విముక్తి పొందుతారని విశ్వసిస్తారు. ఇక్కడి చితాభస్మ హారతి ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా శివుని యొక్క కాల స్వరూపాన్ని గుర్తు చేస్తుంది.
