కార్తీకంలో తప్పక వినాల్సిన లీల ఏమిటి ?

-

కేశవనామాల్లో 12వ నామం దామోదర. కార్తీకమాసానికి దామోదరుడు అధిపతి. కాబట్టి దీన్ని దామోదర మాసం అంటారు. దామోదరం అంటే సమస్తలోకములన్ని లోపల కలవాడు అనేది వైదిక అర్థం. కృష్ణావతారంలో తాడుతో బంధింపపడిన ఉదరం కలవాడు అని లౌకిక అర్థం. ఈ నెలలో తప్పకుండా చదవాల్సిన లేదా తలంచుకోవాల్సిన లీల భాగవతంలోని దామోదర లీల. అనంతమైన విశ్వవ్యాపకుడ్ని ఎవరు కట్టలేరు. కానీ భక్తి ఒక్కటే భగవంతున్ని కట్టివేయవచ్చని యశోదమ్మ కట్టివేసి చూపిందని ప్రహ్లాదుడు విశేషంగా కీర్తిస్తాడు. ఈ లీలలో యశోదమ్మ తాడుతో చిన్ని కృష్ణుని రోటికి కట్టివేస్తుంది.

తర్వాత ఆమె పనిచేసుకుంటుండగా బాలకృష్ణుడు ఈడ్చుకుంటూ వెళ్లి సమీపంలోని రెండు మద్దిచెట్ల మధ్య నుంచి వెళుతాడు. దాంతో ఆ రెండు చెట్టు కూలిపోతాయి. ఆ రెండు చెట్ల నుంచి నారద శాపగ్రస్తులైన కుబేరుని కూమారులు నలకూబరమణిగ్రీవులు బయటకు వచ్చి బాలకృష్ణునికి నమస్కారం చేసి ప్రార్థనచేస్తారు. ఈ లీల అపూర్వమైనది. బాహ్యంగా కాకుండా ఆంతరంగాన్ని గ్రహిస్తే ఒకరి బంధాన్ని విడగొట్టడానికి రోటికి కట్టిన కృష్ణును ధ్యానించాలి. కృష్ణుడు ఇద్దరికి మోక్షప్రాప్తి కల్పిస్తాడు. ఈ లీల విన్నవారికి కర్మబంధాలు తొలుగుతాయి. దామోదరుని పూర్ణ అనుగ్రహం కలిగి కర్మపాశాల నుంచి విముక్తి లభించి నిత్యమైన, సత్యమైన మార్గంలో మానవులు పయనిస్తారని పురాణ ప్రాశ్యస్తం.

– కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

Read more RELATED
Recommended to you

Exit mobile version