శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఏడోరోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీమహావిష్ణువు తిరుమాడవీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు. ప్రకృతికి చైతన్య ప్రదాత. వర్షాలు కురవడం వల్ల పెరిగే చెట్లు, చంద్రుడు, అతని వల్ల పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లే వెలుగొందుతున్నాయి. సూర్యప్రభ వాహనంపైన శ్రీనివాసుని దర్శనంతో ఆరోగ్య విద్య, ఐశ్వర్యం, సంతానం లాంటి ఫలాలు లభిస్తాయి.
చంద్రప్రభ వాహనం
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు రాత్రి మలయప్పస్వామి చంద్రప్రభ వాహనంపై విహరిస్తూ తన రాజసాన్ని భక్తులకు కనువిందుచేశాడు. చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీవారికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి. సాగరుడు ఉప్పొంగుతాడు. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు కలువల్లా వికసిస్తాయి. భక్తుల హృదయాల నుంచి అనందరసం స్రవిస్తుంది.
ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది.
– శ్రీ