దేవుడికి నమస్కరించడంలో భక్తి, వినయం మాత్రమే ముఖ్యం. అయితే తరచుగా మన దేవాలయాలలో లేదా పూజా కార్యక్రమాలలో స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు అనే నియమాన్ని మనం వింటూ ఉంటాం. నిజంగానే మన పురాణాలు, ధర్మశాస్త్రాలు ఈ విషయంలో ఏమి చెబుతున్నాయి? అసలు సాష్టాంగ నమస్కారం అంటే ఏమిటి? స్త్రీ పురుషులకు వేరువేరు నమస్కార పద్ధతులు ఎందుకు నిర్దేశించబడ్డాయి? భక్తి విషయంలో స్త్రీ పురుషులకు భేదం ఉంటుందా? ఈ అంశంపై శాస్త్రాల వెలుగులో తెలుసుకుందాం.
సాష్టాంగ నమస్కారం అంటే ఎనిమిది అంగాలతో కూడిన నమస్కారం. అంటే తల, రెండు చేతులు, రొమ్ము, రెండు పాదాలు, రెండు మోకాళ్లు అనే ఎనిమిది భాగాలు నేలను తాకేలా పూర్తిగా పడుకొని చేసే నమస్కారం. పురుషులు ఈ విధంగా సాష్టాంగ నమస్కారం చేస్తారు. అయితే శాస్త్రాల ప్రకారం స్త్రీలు చేయవలసిన నమస్కారాన్ని పంచాంగ నమస్కారం అంటారు. అంటే తల, రెండు చేతులు, రెండు మోకాళ్లు అనే ఐదు అంగాలతో కూడిన నమస్కారం మాత్రమే స్త్రీలు చేయాలి. దీని వెనుక ప్రధానంగా రెండు కారణాలు చెబుతారు.
మొదటిది శారీరక కారణం: సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు రొమ్ము భాగం నేలను తాకడం వలన స్త్రీలకు, ముఖ్యంగా వారి వక్షోజాలకు (Breast) అసౌకర్యం, లేదా కొన్ని సందర్భాల్లో గర్భాశయానికి సంబంధించిన ఇబ్బందులు కలగవచ్చనేది ఒక అభిప్రాయం.

రెండవది ఆధ్యాత్మిక లేదా పవిత్రతా: ఈ భావం లో హిందూ ధర్మశాస్త్రాలలో, స్త్రీ శరీరం పవిత్రంగా, పూజనీయంగా పరిగణించబడుతుంది. సాష్టాంగ నమస్కారం ద్వారా స్త్రీ తన ఉదర భాగం మరియు వక్షోజాలను నేలను తాకించడం పవిత్రతకు సంబంధించిన కొన్ని ధార్మిక నియమాలను ఉల్లంఘిస్తుందని భావిస్తారు. ముఖ్యంగా గర్భాన్ని ధరించే భాగం భూమిని తాకకూడదనే ఉద్దేశంతోనే పంచాంగ నమస్కారం సూచించబడింది. ఏది ఏమైనప్పటికీ,ఈ నియమాల వెనుక ఉద్దేశం స్త్రీల భక్తిని తగ్గించడం కాదు, వారి శారీరక సౌలభ్యం మరియు పవిత్రతను కాపాడడమే ప్రధాన లక్ష్యం. భగవంతుడికి నమస్కరించడంలో ముఖ్యం మనసులోని భక్తి మాత్రమే, నమస్కార పద్ధతి కాదు.
అందుకే స్త్రీలు పంచాంగ నమస్కారం చేయడం అనేది కేవలం శాస్త్ర సాంప్రదాయాన్ని పాటించడమే తప్ప, వారి భక్తిలో లోపం ఉన్నట్లు కాదు. భగవంతుని పట్ల నిజమైన ప్రేమ, వినయం ఉంటే, ఏ రూపంలో నమస్కరించినా అది దేవుడికి చేరుతుంది. మన పద్ధతి ఏమైనా, మన హృదయంలోని భావం స్వచ్ఛంగా ఉండాలి. భక్తిలో లింగ భేదం ఉండదు, మనసులోనే దైవాన్ని దర్శించవచ్చు. కాబట్టి ఈ నియమం కేవలం ఒక సంప్రదాయం అని అర్థం చేసుకొని, మీరు సౌకర్యంగా భావించే రీతిలో దైవారాధన కొనసాగించండి.
