మనకు చిన్న శస్త్రచికిత్స (Surgery) చేయాలన్నా, లేదా పెద్ద ఆపరేషన్ చేయాలన్నా, వైద్యులు ఇచ్చే మొదటి, ముఖ్యమైన సూచన మన అందరికి తెలిసిందే అదే శస్త్రచికిత్సకు ముందు కచ్చితంగా ఏమీ తినకూడదు, తాగకూడదు. ఈ నియమం వినడానికి కఠినంగా అనిపించినా, ఇది కేవలం రోగి భద్రత కోసం మాత్రమే. ఆపరేషన్‌కు ముందు కొన్ని గంటల పాటు ఖాళీ కడుపుతో ఉండాలని డాక్టర్లు ఎందుకు పదేపదే హెచ్చరిస్తారు? ఈ నియమం వెనుక ఉన్న ముఖ్యమైన ఆరోగ్య రహస్యం ఏమిటి? శస్త్రచికిత్సకు ముందు తినకూడదని డాక్టర్లు ఎందుకు హెచ్చరిస్తారు? తెలుసుకుందాం.
శస్త్రచికిత్సకు ముందు ఆహారం: ఒక పెద్ద ప్రమాదం: శస్త్రచికిత్సకు ముందు ఆహారం తీసుకోకూడదనే నియమాన్ని వైద్య పరిభాషలో “నిల్ పర్ ఓస్” అంటారు. ఇది రోగి యొక్క ప్రాణాలను కాపాడటానికి ఉద్దేశించిన ఒక తప్పనిసరి ముందు జాగ్రత్త. ఆపరేషన్‌కు ముందు ఆహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రధాన ప్రమాదం ఏమిటంటే ఆస్పిరేషన్.

ఆస్పిరేషన్ అంటే ఏమిటి: శస్త్రచికిత్స సమయంలో, రోగికి అనస్థీషియా ఇవ్వబడుతుంది. అనస్థీషియా ప్రభావం వల్ల శరీరం మరియు కండరాలు పూర్తిగా విశ్రాంతి పొందుతాయి. ఈ సమయంలో, అన్నవాహిక మరియు శ్వాసనాళం మధ్య ఉండే కండరాల నియంత్రణ కోల్పోతుంది. కడుపు నిండుగా ఉంటే అందులోని ఆహారం లేదా ద్రవాలు సులభంగా పైకి వచ్చి పొరపాటున శ్వాసనాళంలోకి వెళ్లి, ఊపిరితిత్తుల్లోకి చేరే ప్రమాదం ఉంది.
ఊపిరితిత్తుల్లోకి ఆహారం చేరితే: ఊపిరాడకపోవడం (Choking) రోగి ఊపిరాడక ఇబ్బంది పడతారు. న్యూమోనియా, ఇది చాలా తీవ్రమైన పరిస్థితి. ఊపిరితిత్తుల్లోకి వెళ్లిన ఆహారం లేదా గ్యాస్ట్రిక్ యాసిడ్స్ (ఆమ్లాలు) ఇన్ఫెక్షన్కు దారితీసి, ప్రాణాంతకమైన ఆస్పిరేషన్ న్యుమోనైటిస్ అనే పరిస్థితిని సృష్టించవచ్చు.
ఖాళీ కడుపు ఉండటానికి సూచనలు: ఈ ప్రమాదాన్ని నివారించడానికి, వైద్యులు సాధారణంగా ఒక నిర్దిష్ట సమయ నియమాన్ని పాటిస్తారు. చివరి భోజనం శస్త్రచికిత్సకు కనీసం 6 నుండి 8 గంటల ముందు ఘన పదార్థాలు లేదా జీర్ణమవడం కష్టమైన ఆహారం తీసుకోవడం ఆపాలి. ద్రవ పదార్థాలు, మంచినీరు వంటి పారదర్శక ద్రవాలు (Clear Liquids) ఆపరేషన్‌కు 2 గంటల ముందు వరకు తీసుకోవచ్చు, కానీ చాలా వరకు డాక్టర్లు పూర్తిగా మానేయమని సలహా ఇస్తారు. ఈ నియమం కేవలం కడుపులోని ఆహారాన్ని జీర్ణం చేయడానికి, మరియు అనస్థీషియా సమయంలో కడుపు పూర్తిగా ఖాళీగా ఉండేలా చూసుకోవడానికి ఉద్దేశించబడింది.
శస్త్రచికిత్స అనేది ఎప్పుడూ ఒక రిస్క్ ఫ్యాక్టరే. డాక్టర్లు పాటించమని చెప్పే ‘ఉపవాస నియమం’ అనేది మీ ఆపరేషన్ సురక్షితంగా మరియు ఎలాంటి సమస్యలు లేకుండా జరగడానికి తీసుకునే ఒక ముఖ్యమైన జాగ్రత్త. రోగికి కలిగే కొద్దిపాటి అసౌకర్యం, పెద్ద ఆరోగ్య ప్రమాదాన్ని నివారిస్తుంది.