వినాయకచవితి రోజు వినాయకుడ్ని పూజించే పత్రిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ప్రతి ఒక్క పత్రి మనకు పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకునేందుకు ఉపయోగపడుతుంది.
హిందూ సంస్కృతి, సంప్రదాయాల్లో సైన్స్ కూడా దాగి ఉంటుందన్న సంగతి తెలిసిందే. అందుకనే పూజలను అంతగా తీసిపారేయకూడదని పెద్దలు చెబుతుంటారు. ముఖ్యంగా వినాయకచవితి రోజు వినాయకుడ్ని పూజించే పత్రిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. మొత్తం 21 రకాల పత్రిని వినాయకుడి పూజ కోసం ఉపయోగిస్తారు. అయితే ప్రతి ఒక్క పత్రి మనకు పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. మరి ఆ వివరాలను ఒకసారి పరిశీలిద్దామా..!
1. వాకుడు ఆకు (బృహతీ పత్రం) – ఈ ఆకు శ్వాస కోశ సమస్యలను నయం చేస్తుంది. ముఖ్యంగా ఉబ్బసం (ఆస్తమా) ఉన్నవారు ఈ ఆకును వాడితే గుణం కనిపిస్తుంది.
2. మాచపత్రం – ఈ ఆకు సువాసనలు వెదజల్లుతుంది. అందుకే దీని వాసన చూస్తే ఒత్తిడి, ఆందోళన తగ్గి మానసిక ఉల్లాసం కలుగుతుంది.
3. మారేడు ఆకు – షుగర్ వ్యాధి ఉన్నవారు మారేడు ఆకును నిత్యం వాడితే గుణం కనిపిస్తుంది. అలాగే విరేచనాలు కూడా తగ్గుతాయి.
4. గరిక – మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు గరికలో ఉన్నాయి.
5. ఉమ్మెత్త – శ్వాసకోశ వ్యాధులను నయం చేయడంలో ఉమ్మెత్త బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఆస్తమా వ్యాధిని తగ్గిస్తుంది.
6. రేగు – చర్మ సమస్యలు ఉన్నవారు రేగు ఆకును వాడితే త్వరగా ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.
7. తులసి – ఎప్పుడూ శరీరం వేడిగా ఉండేవారు శరీరాన్ని చల్లబరుచుకునేందుకు తులసి ఆకులను నమలాలి. అలాగే శ్వాస కోశ సమస్యలకు కూడా తులసి దివ్య ఔషధంగా పనిచేస్తుంది.
8. ఉత్తరేణి – దగ్గు, ఆస్తమా సమస్యలను తగ్గించడంలో ఉత్తరేణి ఆకులు బాగా పనిచేస్తాయి.
9. మామిడి – నోటి దుర్వాసన, చిగుళ్ల వాపు సమస్యలను మామిడి ఆకు తగ్గిస్తుంది. మామిడి పుల్లలతో దంతాలను తోముకుంటే నోరు దుర్వాసన రాకుండా ఉంటుంది. అలాగే షుగర్‌కు కూడా ఈ ఆకులు బాగానే పనిచేస్తాయి.
10. జాజి ఆకు – చర్మ సమస్యలున్నవారు, స్త్రీ సంబంధ వ్యాధులకు ఈ ఆకును ఉపయోగిస్తే ఫలితం ఉంటుంది.
11. గండకీ పత్రం – అతిమూత్ర సమస్య ఉన్నవారు ఈ ఆకును ఉపయోగించాలి.
12. రావి ఆకు – చర్మ సమస్యలు ఉన్నవారు ఈ ఆకులను ఉపయోగిస్తే వాటి నుంచి త్వరగా బయట పడవచ్చు.
13. మద్ది ఆకు – గుండె ఆరోగ్యానికి, రక్తం బాగా పడేందుకు ఈ ఆకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
14. జిల్లేడు ఆకు – నరాల బలహీనత, చర్మ సమస్యలు ఉన్న వారు ఈ ఆకును ఉపయోగిస్తే ఫలితం ఉంటుంది.
15. పొద్దు తిరుగుడు (విష్ణు క్రాంతం) – ఈ ఆకులతో చర్మ సౌందర్యం మరింత పెరుగుతుంది.
16. దానిమ్మ – వాంతులు, విరేచనాలను అరికట్టడంలో, హానికారక క్రిములను నాశనం చేయడంలో దానిమ్మ ఆకులు అమోఘంగా పనిచేస్తాయి.
17. దేవదారు – శరీరంలో బాగా వేడి ఉన్న వారు ఈ ఆకులను వాడితే ఫలితం ఉంటుంది.
18. ధవనం – ఈ మొక్క ఆకులు సువాసనను వెదజల్లుతాయి. వీటి వాసన చూస్తే ఒత్తిడి ఇటే మటుమాయం అయిపోతుంది.
19. వావిలాకు – కీళ్ల నొప్పుల సమస్య ఉన్నవారు ఈ ఆకును వాడితే ఉపయోగం ఉంటుంది.
20. శమీ (జమ్మి) పత్రం – నోటి సంబంధ వ్యాధులను తగ్గించడంలో జమ్మిఆకులు బాగా పనిచేస్తాయి.
21. గన్నేరు – గడ్డలు, పుండ్లు, గాయాలు తగ్గేందుకు ఈ మొక్క వేరు, బెరడును ఉపయోగిస్తారు.